21 September, 2011

మతాన్నిబట్టి న్యాయం

--సాక్షి
September 17th, 2011

మాటవరసకు మీ వీధిలో ఓ కిరాణా దుకాణముంది. అక్కడ సరుకులు కల్తీ; తూకంలో మోసం! ఆ సంగతి మీరు కనిపెట్టారు. పదిమందికీ చెప్పారు. అందరూ అక్కడ కొనడం మానేశారు. మీ దెబ్బకు ఆ దుకాణం మూతపడింది.

మంచిపని చేశానని మీరు అనుకున్నారు. మంచిపనే. కాని - సరికొత్త మతహింస బిల్లు చట్టమయ్యాక మీరు ఇదే పని చేస్తే... ఆ షాపు నడిపేవాడు ఏ అబ్రహామో, అబ్దుల్లానో అయితే... మీకు మూడినట్టే! అతగాడు పితూరీ చేసిన మరుక్షణం పోలీసు ఇనె్స్పక్టరు రెక్కలు కట్టుకుని మీ ఇంటికొచ్చి- ‘‘మైనారిటీ వర్గానికి చెందినవాడి వ్యాపారాన్ని బహిష్కరించి, అతడి జీవనోపాధిని దెబ్బతీయుట ద్వారా మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణాన్ని కల్పించుట’’ అనే నేరం కింద మిమ్మల్ని ఉన్నపళాన అరెస్టుచేసి జైల్లోకి తోస్తాడు. దాని వెనక ఎవరున్నదీ మీకు తెలుసు కాబట్టి మీరో, మీ వాళ్లో పరుగున పోయి వ్యాపారి కాళ్లు పట్టుకుని కేసు మాఫీ చేయించుకోగలరేమో! కాని కొన్ని సందర్భాల్లో అదీ కుదరదు.

యథేచ్ఛగా జరిగే మతాంతరీకరణలు అనర్థమనో, ఇస్లామిక్ టెర్రరిజానికి పాలుపోసే వారిని పట్టుకోవాలనో, ఏదో మైనారిటీ విద్యాసంస్థ అక్రమాల గురించో మీరు ఎప్పుడో, ఎవరి ముందో ఘాటుగా మాట్లాడి ఉండవచ్చు. మైనారిటీ మతస్థులతో ఏ లావాదేవీలోనో, వృత్తి, వ్యాపార పరంగానో గొడవపడి ఉండవచ్చు. లేదా ఏ వందేమాతరం క్లబ్బుకో, మైనారిటీలకు సరిపడని హిందూమత సంస్థకో విరాళం ఇచ్చి ఉండవచ్చు. కర్మంచాలకపోతే వీటిలో దేని గురించి ఫిర్యాదు అందినా పోలీసువాడు సంకెళ్లుపట్టుకుని మీ ఇంటికి రాగలడు. మైనారిటీ వర్గంపై ద్వేష ప్రచారం చేశావనో, మైనారిటీ వర్గానికి చెందిన కారణంతో ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేశావనో, చేస్తానని బెదిరించావనో, మైనారిటీ వర్గానికి ప్రతికూల వాతావరణం కల్పించేందుకు సహకరించావనో ఫిర్యాదు అందింది కనుక మతహింస చట్టం కింద అర్జంటుగా నిన్ను అరెస్టు చేస్తున్నాననగలడు. ‘‘ఎవడో ఫిర్యాదు చేసినంత మాత్రాన నేను నేరం చేసినట్టేనా? చేశానో లేదో మీరు విచారించి నిర్ధారించుకోవద్దా?’’ అంటారు మీరు. ‘‘అదేమో నాకు తెల్వద్. నేరం రుజువయ్యేదాకా ప్రతోడూ నిర్దోషేనని నీలాంటోళ్లు చెప్పే కబుర్లు ఇక్కడ నడవవ్. మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా నేరం జరిగిందా లేదా అన్న ప్రశ్న వస్తే - జరిగిందనే భావించాలని కొత్త చట్టం 73వ సెక్షను చెబుతుంది. నేరం చెయ్యలేదని రుజువయ్యేదాకా నిందితుడు నేరంచేసి ఉంటాడనే అనుకోమని 74వ సెక్షను అంటుంది. నీ మీద ఫిర్యాదు వచ్చింది కాబట్టి నువ్వు నేరం చేసినట్టే! నిన్ను బొక్కలో తొయ్యాల్సిందే’’ అంటాడు పోలీసు. అది విని మీ బుర్ర గిర్రున తిరుగుతుంది. ‘‘మా లాయరుతో మాట్లాడుతా. ఏం చేయాలో ఆలోచించి మీ దగ్గరికి వస్తా’’ అంటారు. ‘‘ఆ పప్పులక్కడ ఉడకవ్ తమీ. ఈ చట్టం కిందికి వచ్చే ఏ నేరమైనా కాగ్నిజబుల్ అఫెన్స్. నిన్ను వెంటనే అరెస్టు చెయ్యాల్సిందే. లాయరొచ్చి బెయిలు తెస్తాడనుకుంటున్నావేమో ఈ కేసుల్లో బెయిలు కూడా ఇవ్వరు. కదులు ముందు’’ అని తొందరపెడతాడు పోలీసు. ఇక మీకు ఏడుపొచ్చేస్తుంది. ‘‘కనీసం నా మీద కంప్లయింటు చేసిందెవరో చెప్పండి. పోయి కాళ్లయినా పట్టుకుంటాను’’ అంటారా?

నో చాన్స్! ఆ ఆశాలేదు. బాధితుడు ఎవరన్నది ఎవరికీ తెలియనివ్వకూడదని 40వ సెక్షను ఆన!
పోనీ - మీ ఏడుపుకు దయతలిచో, మీ వాలకం గమనించో, వారినీ వీరినీ వాకబు చేసో, మీకు అంతటి నేరం చేసేంత సీను లేదని పోలీసు ఇన్స్ప్‌క్టరు ధ్రువపరచుకుని మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నాడనుకోండి. ఐనా మీ కష్టాలు తీరవు.

పసలేని ఫిర్యాదులెమ్మని పోలీసులు దేన్నీ బుట్టలో పడెయ్యటానికి వీల్లేదు. ఫిర్యాదుపై దర్యాఫ్తు ఎంతవరకు వచ్చిందీ, ఎవరిని అరెస్టు చేసిందీ, చార్జిషీటు ఎప్పుడు పెట్టేదీ ఎప్పటికప్పుడు ఫిర్యాదుదారుకు రాతపూర్వకంగా దాఖలు చేసుకోవలసిన బాధ్యత 69వ సెక్షను ప్రకారం దర్యాఫ్తు అధికారిపై ఉంటుంది! అరెస్టు చెయ్యలేదు, చార్జిషీటు పెట్టట్లేదు అని పోలీసులంటే ‘‘బాధితుడు’’ ఊరుకోడు. ఏకంగా సరికొత్త ‘‘నేషనల్ అథారిటీ’’కో, ‘‘స్టేట్ అథారిటీ’’కో పోతాడు. ఒక్కో అథారిటీలోనూ ఏడుగురు మెంబర్లుంటారు. వారిలో కనీసం నలుగురు కంపల్సరీగా మైనారిటీ వర్గాలకు చెందిన వాళ్లే ఉంటారు. వాళ్ల చేతిలో ప్రభుత్వాలనే ఫుట్‌బాల్ ఆడగలిగేంతటి అధికారాలుంటాయి.

కట్ చేస్తే... ఏ మహాద్భుతమో జరిగితే తప్ప మీకు మూడేళ్ల నుంచి యావజ్జీవం వరకూ జైలుశిక్ష, భారీ జుల్మానా గ్యారంటీ!

దేశవిభజన కాలం నుంచి నేటిదాకా ఇండియాలో ఎన్నో మతకల్లోలాలు జరిగాయి. ఎన్నో వేలూ, లక్షల మందిని దారుణంగా బలిగొన్నాయి. వారిలో అన్ని మతాలకు చెందినవారూ ఉన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టిన పాపంలో మెజారిటీ మైనారిటీ అన్న తారతమ్యం లేదు. దేశం మొత్తంమీద చూస్తే మైనారిటీ అయిన వారిది కూడా ఒక రాష్ట్రంలో, ఒక జిల్లాలో, లేక ఒక నగరంలో మెజారిటీ అయిన దృష్టాంతాలు లెక్కలేనన్ని. మానవత్వానికి, సభ్య సమాజానికి సిగ్గుచేటు అయిన మత హింస ఉన్మాదానికి పాల్పడింది ఎవరైనా, ఏ మతస్థులైనాసరే అందరినీ ఒకే విధంగా పరిగణించి, కఠినాతి కఠినంగా శిక్షించాలనే ఎవరైనా కోరేది. మతంతో విశ్వాసాలతో నిమిత్తం లేకుండా భారత పౌరులందరికీ సమాన న్యాయం, సమాన హక్కు ఉండాలనే అందరమూ అడిగేది.

అదీ పేరాశేనని దయగల యు.పి.ఎ. సెక్యులర్ సర్కారువారు ఇప్పుడు బ్రహ్మాండంగా తేల్చి పారేశారు. పార్లమెంటు నెత్తిమీద సూపర్ పార్లమెంటులా అమాంబాపతు శాల్తీలతో కొలువుతీరిన నేషనల్ అడ్వయిజరీ కౌన్సిలు వండివార్చి, కేంద్ర కేబినెటు కళ్లు మూసుకుని ఓకే చేసి, ఇక పార్లమెంటు ఆమోదం తతంగమే తరువాయి అనుకుంటున్న Prevention of Communal and Targeted Violence Bill, 2011 లో ఫొందుపరిచిన ప్రకారం-

మైనారిటీలపై మెజారిటీ వర్గం జరిపేది మాత్రమే ‘మతహింస’గా పరిగణించబడును. ముస్లింలపై హిందువులలాగే, హిందువులపై ముస్లింలో, ఇంకో మతస్థులో మతహింసకు పాల్పడ్డ ఉదంతాలు ఇటీవలి చరిత్రలో ఎన్ని ఉన్నా సరే! ఈ తల తిక్క బిల్లు దృష్టిలో - మైనారిటీ వర్గాలు మాత్రమే మతహింసకు బాధితులు.

'Victim' means any person belonging to a "group"
(భాధితుడు అనగా ఒక గ్రూపునకు చెందిన వారెవరైనా.)

"Group" means a religious or linguistic minority...
(‘‘గ్రూఫు’’ అనగా మతపరమైన, లేక భాషాపరమైన మైనారిటీ...)

అని 3వ సెక్షనులో ఇచ్చిన అమోఘ నిర్వచనాలను బట్టే ‘గోధ్రా’ రైలు పెట్టెలో సజీవ దహనమైన అభాగ్యులూ, 1993 బొంబాయి అల్లర్లలో ఘోరంగా బలి అయిన వందలాది హిందువులూ, కాశ్మీర్ గడ్డ నుంచి గెంటివేయబడ్డ లక్షలాది పండిట్లూ ‘మత హింస’ బాధితుల లెక్కలోకి రారని స్పష్టం. కుల, మత, విశ్వాసాలకు అతీతంగా భారత పౌరులందరూ చట్టం దృష్టిలో సమానులన్న రాజ్యాంగ సూత్రాన్నీ, నేరం రుజువయ్యేదాకా ఎవరినైనా నిరపరాధిగా చూడాలన్న సాధారణ న్యాయాన్నీ గుంటపెట్టి గంట వాయించి... ‘మతాన్నిబట్టి న్యాయం’ అన్న అడ్డగోలు సిద్ధాంతాన్ని లేవదీసిన జాతీయ సలహామండలి మేధావుల తెలివికి జోహార్లు! మైనారిటీల ప్రయోజనాలను కాపాడటమంటే మెజారిటీ ప్రజలను కాలరాచి, తుంగలో తొక్కడమేనని కనిపెట్టిన వీర సెక్యులర్ సర్కారువారి బుర్రే బుర్ర!

Courtesy : Andhra Bhoomi (Telugu Daily)  

2 comments:

Anonymous said...

Very dangerous bill. Bad is always bad whether it is done by any person. So there should be same law for all means unbiased.

Anonymous said...

The bill should not be passed in parliment. Those who r interested in nation they all should come forward and see that bill should be thrown in a dust bin.

Post a Comment