25 November, 2011

పవార్‌కు చెంపదెబ్బ!


న్యూఢిల్లీ, నవంబర్ 24: దేశంలో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలు, కుంభకోణాల పట్ల ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసి సంచలనం సృష్టించాడు. దేశ రాజధానిలో గురువారం సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ను గట్టి చెంపదెబ్బ కొట్టి వార్తల్లోకి ఎక్కాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో దిగ్భ్రాంతికి గురైన పవార్ అక్కడి నుంచి తప్పుకుని మీడియాకు దూరంగా వెళ్లిపోయారు. ఇక్కడి ఎన్‌డిఎంసి సెంటర్‌లో తన కోసం వేచి చూస్తున్న మీడియా కెమెరాల వద్దకు మెల్లగా నడుచుకుంటూ వస్తుండగా పవార్‌పై 30 సంవత్సరాల పైబడిన వయసు గల హర్వీందర్ సింగ్ అనే సిక్కు యువకుడు దాడి చేశాడు. పవార్ ఇంకా మాట్లాడడం మొదలుపెట్టకముందే కెమెరాల మధ్య నుంచి వచ్చిన హర్వీందర్ సింగ్ మంత్రి ఎడమ చెంపపై కొట్టాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన పవార్ కెమెరాలకు దూరంగా వెళ్లిపోయారు. ఆగ్రహంతో ఊగిపోతున్న సదరు యువకుడు అరుస్తూ తన నడుముకున్న కృపాణాన్ని తీసి గాలిలో ఊపసాగాడు. ‘వారంతా అవినీతిపరులు’ అని అతను అరిచాడు. అయితే భద్రతా సిబ్బందిలోని ఒకతను వెంటనే అప్రమత్తమై యువకుని వద్దనున్న కృపాణాన్ని తీసుకున్నాడు. వరుసగా జరుగుతున్న కుంభకోణాలకు నిరసనగానే తాను పవార్‌ను కొట్టానని హర్వీందర్ సింగ్ చెప్పాడు. నాలుగు రోజుల క్రితం మాజీ టెలికాం మంత్రి సుఖ్‌రామ్‌ను కొట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యానని అతను చెప్పాడు.

Courtesy : Andhra Bhoomi

No comments:

Post a Comment