30 January, 2014

గణతంత్ర దినోత్సవం అంటే ఒక పండుగే....!


ఏకలవ్య ఫౌండేషన్ అంటే నిజమైన ఏకలవ్యుల కోసం పనిచేస్తున్న సంస్థ. "అక్షయ విద్య" పేరుతో మురికివాడలలో నివసిస్తూ కనీసం బడి ముఖమైన చూడని పిల్లలకు పైసా ఖర్చు లేకుండా చదువు చెప్పిస్తున్నది ఏకలవ్య ఫౌండేషన్. ఈ చదువు వారికి ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు కాని, ఆ అమాయక పిల్లల హృదయాలలో ఆనందాన్ని మాత్రం ఖచ్చితంగా నింపుతున్నదనే చెప్పవచ్చు. ఈ క్రింది ఫోటోలలోని వారి ముఖాలు చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

65వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భాగ్యనగర్ తీగలగూడ బస్తీలో ఏకలవ్య ఫౌండేషన్ వారు గణతంత్ర దినోత్సవాలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఆ రోజంతా ఆ బస్తీ పిల్లలు, వారి తల్లితండ్రులు ఒక పండుగ రోజు వలె గడిపారు. నిజమైన పండుగ దినాలలో వారంతా అంత ఆనందంగా ఉండరేమో.

గణతంత్ర దినోత్సవం అంటే ఉపాధ్యాయులంతా గంటల తరబడి వచ్చీ రాని భాషలో ఎందుకూ పనికిరాని ఉపన్యాసాలు దంచి, పిల్లలకు బోరు కొట్టించి, చివరకు ఒక చాక్లెట్ చేతిలో పెట్టి వెళ్లిరండి నాయనా! అనే రోజులు మనవి. గణతంత్ర దినోత్సవం రాజకీయ నాయకుల పండుగ అని అనుకునే ఈ రోజులలో, "మన జాతీయ జెండా" అని మురికివాడలలోని పిల్లలచేత కూడా గుర్తింపచేసిన ఏకలవ్య ఫౌండేషన్ కృషి చాలా చాలా మెచ్చుకోదగినది. ఇంత వైభవంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవచ్చని చూపించిన ఏకలవ్య ఫౌండేషన్ వారి ఈ ఐడియా అద్భుతం.

గణతంత్ర దినోత్సవం అంటే ఒక పండుగ అని రాజకీయ నాయకులకే కాక పిల్లలకు, పెద్దలకు కూడా అనిపించిననాడే మన దినోత్సవాలకు ఒక విలువ, గుర్తింపు వస్తుంది. ఆ విషయంలో ఏకలవ్య ఫౌండేషన్ వంద శాతం విజయం సాధించింది.

ఈ క్రింది చిత్రమాలిక చూడండి. మీరు కూడా పండుగ చేసుకున్నంతగా సంబరపడిపోతారు.




No comments:

Post a Comment