04 February, 2014

చొరబాట్లు ఆపలేరా?

ప్రార్థన చేస్తున్న ఆర్.ఎస్.ఎస్. సర్ కార్యవాహ మా.శ్రీ భయ్యాజీ జోషి (కుడివైపు చివర), పూర్వాంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ మా.శ్రీ సుందరమూర్తి (మధ్యలో) తదితరులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 1: సువిశాల భారత భూభాగంలోకి పొరుగు దేశాలు చొరబాట్లకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకుండా మొద్దునిద్దర పోతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్‌ఎస్) ధ్వజమెత్తింది. రెండు రోజులుగా విశాఖలో జరుగుతున్న బైఠక్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఆళ్వార్‌దాస్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో సంఘం సర్ కార్యవాహక్ భయ్యాజీ జోషి మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి సరిహద్దు దేశాలు భారత భూగాగంలోకి అక్రమంగా చొరబడుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 43వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా అది తమ దేశంలో అంతర్భాగంగానే భావిస్తోందన్నారు. 

అరుణాచలప్రదేశ్‌లోకి చొచ్చుకొచ్చిన చైనా భారతీయుల్లో అభద్రతాభావాన్ని పెంచుతోందని ఆరోపించారు. అరుణాచల్ నుంచి చైనా వెళ్లాలంటే వీసా వంటివి ఏమీ అవసరం లేదంటూ చైనా బహిరంగంగా ఆహ్వానిస్తోందంటే ఎంత దురహంకారంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవాలన్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సరిహద్దు రాష్ట్రాలు దేశంలో కల్లోల్లాన్ని సృష్టించేందుకు వెనుకాడటం లేదని ఆరోపించారు. తీవ్రవాద దాడుల్లో మరణించిన వారిసంఖ్య అమరవీరులను మించి ఉందన్నారు. ఇక పక్కనున్న అతిచిన్న దేశం బంగ్లాదేశ్ నుంచి సుమారు 3.5కోట్ల మంది మనదేశంలోకి అక్రమంగా ప్రవేశించి నిర్భయంగా జీవిస్తున్నారని వివరించారు. కనీసం వీరికి వీసా, పాస్‌పోర్టు వంటివి లేవని అయినా మన పాలకులు మాత్రం వీరిపట్ల ఎంతో ఉదాశీనంగా వ్యవహరించడం చేతగాని తనంగా భావించాల్సి వస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఇక భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు సరిహద్దు దేశాలు కుట్రలు పన్నుతున్నాయని భయ్యాజీ జోషి ఆరోపించారు. తమ ఉత్పత్తులను కారుచౌకగా భారత్‌లోకి ప్రోత్సహిస్తున్న చైనా ఆర్థికంగా లబ్ధి పొందుతోందన్నారు. చైనా ఉత్పత్తులను వ్యతిరేకించడం ద్వారా భారతజాతికి న్యాయం చేయాలని పిలుపినిచ్చారు. దేశం బలహీనమైతే విదేశాలకు మార్గం సులభమవుతుందని, హిందూ దేశం సంఘటితం కావడం ద్వారానే దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలపగలమని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment