01 October, 2016

మారీచుడిని మించిన మాయావికి కీలెరిగి వాత

చేతకానివాడు ప్రతి అవకాశంలో ఒక సమస్యను చూస్తాడు. చేవగలవాడు ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూస్తాడు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా చేవగలిగినవాడు. పట్టపగ్గాలు లేకుండా పేట్రేగుతున్న పాక్‌కి కీలెరిగి వాతమీద వాత పెట్టగలిగిన మొనగాడు.

పాకిస్తాన్ మారీచుడిని మించిన మాయావి. ఆగర్భశత్రువుగా తాను పరిగణించే భారత్‌ను ప్రత్యక్ష యుద్ధంలో గెలవజాలనని దానికి తెలుసు. జన్మలో ఒక్క యుద్ధాన్నీ గెలవలేని తన సైన్యం పరాక్రమమెంతో అది బాగా ఎరుగును. 1965లో ఇండియా చేతిలో పచ్చడయ్యాక, 1971లో సగం దేశాన్ని కోల్పోయి, తన సైనికులు 93వేల మంది భారత్‌కి యుద్ధ ఖైదీలుగా చిక్కిన సిగ్గుచేటు దుర్గతి తరవాత ప్రబల శత్రువు మీద కక్ష తీర్చుకోవడానికి ఇస్లామాబాద్ టెర్రరిజం దారి పట్టింది.

సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నదీ... తన గడ్డను ఉగ్రవాద సంస్థల అడ్డాగా మార్చిందీ... తన కబ్జాలోని ఆక్రమిత కాశ్మీర్ గుండా జిహాదీలను భారతదేశంలోకి రవాణా చేస్తున్నదీ... పార్లమెంటు మీద దాడి, ముంబయి ముట్టడి సహా లెక్కలేనన్ని ఘాతుకాలకు పాల్పడి భయంకర విధ్వంసానికి, రక్తపాతానికి పాల్పడుతున్నదీ పాకిస్తానేనని లోకానికి తెలుసు. ఇండియాపై అప్రకటిత టెర్రర్ యుద్ధం వెనుక పాక్ పాపిష్టి ప్రమేయాన్ని నిరూపించటానికి లెక్కలేనన్ని రుజువులు న్యూఢిల్లీ చూపెట్టింది. అవన్నీ నిరాధార నిందారోపణలనీ, తానే పాపం ఎరుగననీ ఇస్లామాబాద్ ఇంతకాలమూ అడ్డగోలుగా వాదిస్తూ వచ్చింది. నగరాల మీదో, జనసమ్మర్ధంగల ప్రాంతాలలోనో, సైనిక స్థావరాలపైనో టెర్రరిస్టు దాడులు జరిగిన ప్రతిసారీ రుజువులు, సాక్ష్యాలతో ఇస్లామాబాద్‌ను నిలదీసినా దౌత్యపరంగా ఒత్తిడి తెచ్చినా... అంతర్జాతీయ వేదికలపై ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేక న్యూక్లియర్ విలయానికి వెరచి ప్రత్యక్ష యుద్ధానికి సాహసించలేక మునుపటి భారత ప్రభుత్వాలు నిస్సహాయంగా సతమతమయ్యాయి.

అయితే యుద్ధం... లేదా చర్చలు! ఉన్నవి రెండే దారులు. యుద్ధంవల్ల వినాశం తప్పదు అనుకున్నప్పుడు చర్చలే శరణ్యం. ఆవలి దేశానికి నిజాయతి, చిత్తశుద్ధి బొత్తిగా లేకపోయినా, మన అతి మంచితనాన్ని అలుసుగా తీసుకుని వరసగా ఎన్ని ఘోరాలకు పాల్పడుతున్నా సంభాషణల యజ్ఞాన్ని ఆపకూడదు; ప్రతీకార చర్యను తలపెట్టనే కూడదు అన్న విచిత్ర మనస్తత్వం ప్రభుత్వాన్ని నడిపే వారిని, మేధావులు, రాజకీయ వ్యాఖ్యాతలు అనబడే వారిని ఆవహించడంతో ఇనే్నళ్లూ పాకిస్తాన్ ఆడింది ఆట అయింది.

ఇలా అంతులేని కథ అనుకున్నది కాస్తా నరేంద్ర మోది రంగంలోకి వచ్చాక ఊహించని మలుపు తిరిగింది. పాకిస్తాన్‌ని దెబ్బకు దెబ్బ తియ్యాలంటే చతురంగ బలాలను సమీకరించి, బాహాటంగా యుద్ధానికే సిద్ధపడనక్కర్లేదు. ఎదురెత్తి చదరంగం ఆడి కూడా ప్రత్యర్థి ఆట కట్టించవచ్చు. ఆ ఒడుపు మోదీకి తెలుసు. టెర్రరిస్టుల ముసుగులో ఇండియా మీద యుద్ధానికి పాల్పడుతూ, వారికీ తమకూ సంబంధం లేదని కదా పాకిస్తానీలు ఆటాడుతున్నది? టెర్రరిస్టుల ఏరివేత పేరుతో గురిచూసి, మాటువేసి వేట మొదలెడితే ఇస్లామాబాద్ ఏమి చేయగలదు? అది తనమీద దాడి అని ఎలా చెప్పుకోగలదు? మాయా యుద్ధానికి మాయా యుద్ధమే జవాబు. అధీనరేఖ ఆవలికి బలగాలను మెరపులా దూకించి జరిపించిన ‘సర్జికల్ దాడి’ ద్వారా ఇస్లామాబాద్‌కి దాని ఔషధాన్ని దానికే మోదీ సర్కారు రుచి చూపించింది.

అధీనరేఖ అవతలి టెర్రర్ ప్రయోగ కేంద్రాలపై మెరపు దాడికి మన సైనిక నిపుణులు కొనే్నళ్ల కిందటే ‘కోల్డ్ స్టార్ట్’ పేరిట వ్యూహరచన చేశారు. తెగించి దాన్ని అమలుపరచగల దమ్ము, ధైర్యం వెనకటి పాలకులకు లేకపోవటంతో అది అందమైన ఊహగానే మిగిలిపోయింది. పాకిస్తాన్ ఆదమరచి ఉన్న సమయంలో అధాటున మెరపు దాడి చేయాలని నాటి వ్యూహకర్తలు తలపోశారు. మనకు కలేజా ఉంటే అవతలిపక్షం సర్వసన్నద్ధమై కళ్లలో వత్తులు వేసుకుని సరిహద్దుల్లో కాపలా కాస్తుండగా కూడా ‘సర్జికల్ దాడి’కి దిగవచ్చునని అజిత్ దోవల్, పారికర్‌ల బృందం ఇప్పుడు లోకానికి చాటింది.

‘కోల్డ్‌స్టార్ట్’ని ఇలా ‘హాట్ స్టార్ట్’గా ప్రయోగించి, పాకిస్తాన్ దిమ్మ తిరిగేట్టు చేయడానికీ పాకిస్తాన్ పాత వ్యూహమే మనవాళ్లకు ఎంచక్కా పనికి వచ్చింది. అధీనరేఖ ఎన్నో కిలోమీటర్ల పొడవు ఉండటంవల్ల మన భద్రతా బలగాలు ఎంత పహరా కాసినా చీకటిలో వాటి కళ్లుకప్పి ఏదో ఒకవైపు నుంచి పాకిస్తానీ టెర్రర్ ఏజంట్లు చొరబడగలిగే వాళ్లు. ఆ సమస్యనే అవకాశంగా మార్చుకుని మన కమాండోలు అదే పద్ధతిలో పాకిస్తానీ సేనల కళ్లు గప్పి గీత దాటగలిగారు.
ఏకబిగిన నాలుగుగంటలకు పైగా టెర్రరిస్టుల వేట సాగి, 40 మందిని హతమార్చి, వెళ్లిన వాళ్లందరూ క్షేమంగా తిరిగొచ్చిన తరవాత గానీ పాకిస్తానీల ఎదురు కాల్పులు మొదలవలేదు. అదీ పాకిస్తానీల ప్రతాపం. కంట్రోలు లైను (ఎల్.ఒ.సి.) పొడవునా టెర్రర్ కుంపట్లు పెట్టి మనల్ని తిప్పలు పెడుతూంటే ఇంకేమాత్రం చూస్తూ ఊరుకోబోమనీ, వారికన్నా బాగా మనమూ గీతదాటి యధేచ్ఛగా వేటాడగలమనీ రుజువు చేయటంతో మాయావులకు తల తిరిగింది. ఉపఖండంలో పరిస్థితి తారుమారైంది. ఇంతదాకా పాకిస్తాన్ దొంగదాడులు చేస్తే న్యూఢిల్లీ ఐరాస లాంటి సంస్థలకు ఫిర్యాదు చేసేది. ఇప్పుడు ఇండియా తమపై ఫలానా విధంగా దాడి చేసిందని కూడా చెప్పుకోలేక శాపనార్థాలు పెడుతూ పాకిస్తాన్ లబోదిబోమంటున్నది.

భారత్ మీద అకారణ ద్వేషంతో బరితెగించిన పాక్‌కు తాజా ‘ఆపరేషను’ షాకు ట్రీట్‌మెంటు. కాని వాటం చూసి, ఎప్పుడో ఒకసారి ఇస్తేనే షాకులు పనిచేస్తాయి. మన మానాన మనల్ని బతకనివ్వకుండా అడుగడుగునా అపకారాలు చేస్తూ చెడ్డ చికాకు పెడుతున్న పాకిస్తాన్‌కి బుద్ధి గరపడానికి సర్జికల్ దాడులు మాత్రమే సరిపోవు. బహుముఖీన సమర్థ వ్యూహం కావాలి.

సీమాంతర ఉగ్రవాదాన్ని ఆయుధంగా పట్టి పాకిస్తాన్ ముప్ఫైఏళ్లకు పైగా మనల్ని దెబ్బ మీద దెబ్బ కొడుతూ దారుణంగా నెత్తురోడుస్తున్నా, ఆ బెడదను ఎలా ఎదుర్కోవాలన్న దాని గురించి ఇంతకాలమూ మనకు సరైన వ్యూహమే లేదు. మన మంచితనాన్ని ఉబకేస్తూ ప్రపంచ రాజ్యాలు పలికే శుష్కప్రియాలకు మురిసి, అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ని ఏకాకిని చేయగలిగామని ఆత్మవంచన చేసుకోవటం మన ప్రత్యేకత. పౌరుషంతో విరోధి మీద ప్రతీకార చర్యకు తలపెడితే ‘గుడ్ బాయ్‌ల’మని ప్రపంచంలో కష్టపడి సంపాదించుకున్న సర్ట్ఫికెటు ఎక్కడ పోతుందోననే ఎంతసేపూ మన మాజీపాలకుల వెంపర్లాట. నిన్నమొన్న ఉరీ దాడిని పెద్ద గొంతుతో ఖండించినా, దానికి పాల్పడిన పాకిస్తాన్ పేరు ఎత్తడానికి ఏ పెద్ద రాజ్యానికీ నోరు రాలేదు. పాక్ పాపాలకు సాక్ష్యాలు, రుజువులు చూపించి మనం ఎంత మొత్తుకున్నా తమ వ్యూహాత్మక స్వప్రయోజనాలకోసం అమెరికా, బ్రిటన్‌లు ఇస్లామాబాద్‌ని పాలుపోసి పెంచుతున్నాయి. ఒకప్పుడు మన పక్షాన కొండంత అండగా నిలబడ్డ రష్యా కూడా ఇప్పుడు పాకిస్తాన్‌కి ధారాళంగా ఆయుధాలందిస్తూ, ఉమ్మడి సైనిక ఆపరేషన్లకు ఉబలాటపడుతున్నది. ఎండైనా వానైనా ఎల్లవేళలా పాక్ కొమ్ముగాసే ది గ్రేట్ చైనా సరేసరి! నీతులు, ఆదర్శాల తీపి కబుర్లు ఎన్ని చెప్పినా అంతిమంగా ఏ రాజ్యమైనా తన స్వార్థమే తాను చూసుకుంటుంది.

మన కమతంలో చొరబడ్డ దుండగులను మనమే గెంటివేయాలన్న విజ్ఞత లేక, షేక్ అబ్దుల్లా దుర్బోధకు తల ఒగ్గి మూడోవంతు కాశ్మీర్ పాక్ కబ్జాలో ఉండగానే సైన్యాన్ని వెనక్కి పిలిపించి, ఐరాస గడప ఎక్కిన నెహ్రూ పండితుడి అడుగుజాడల్లో నడవటంవల్ల మనకు మనం చేసుకున్న చేటును ఇప్పుడైనా మనం గ్రహించాలి. ఇతర దేశాల చుట్టూ తిరిగి, పితూరీలు చేయటం ద్వారా పాకిస్తాన్‌ని ఎన్నటికీ నిలవరించలేమని గుర్తించాలి. మన జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని, దెబ్బకుదెబ్బ తీసే తీరుతామని అర్థమయ్యే భాషలో చెబితే తప్ప పాకిస్తాన్ దారికి రాదు. దెబ్బకు దెబ్బ తియ్యటానికి యుద్ధమే చేయనక్కర్లేదు. టాంకులు, శతఘు్నల కంటే పటిష్ఠమైన సాధనాలు ఈ కాలంలో ఎన్నో ఉన్నాయి.

ఉదాహరణకు - సింధు జలాల సంగతే తీసుకోండి. ప్రపంచ బ్యాంకు సంధానకర్తగా నిలబడి 1960లో కుదిర్చిన సింధు నీటి ఒప్పందం ద్వారా పాకిస్తాన్ అపార నదీజలాలను తేరగా అనుభవిస్తున్నది. ఆ నీళ్లే దానికి జీవనాధారం. పాక్ వ్యవసాయంలో 90 శాతానికి అదే ఆలంబనం. అంతర్జాతీయ మెరమెచ్చులను ఆశించి నెహ్రూ పండితుడు సంతకం చేసిన ఆ ఒప్పందం పూర్తిగా పాకిస్తాన్‌కే అనుకూలం. తూర్పున ఉన్న మూడు నదులు (రావి, బియాస్, సట్లెజ్) మనకు, వాటికి పడమటి మూడు నదులు (సింధు, చినాబ్, జీలం) పాకిస్తాన్‌కి కేటాయించటం ద్వారా ఇరు పక్షాలకు సమాన న్యాయం చేసినట్టు పైకి కనపడుతుంది. కాని మన మూడు నదుల నీటి పరిమాణం కంటే పాక్ పరమైన మూడునదుల నీటి పరిమాణం మూడింతలు ఎక్కువ. నదీ జలాల వాడకంలో ఎగువన ఉన్నవారి కనీస అవసరాలు చూశాకే దిగువన ఉన్నవారి వాటాను తేల్చటం రివాజు. 1960 నాటి ఒప్పందం ఎగువన ఉన్న ఇండియాకు 20 శాతం నీటిని మాత్రం విదిల్చి 80 శాతాన్ని పాకిస్తాన్‌కు హక్కు భుక్తం చేసింది. మనకు కేటాయించిన కొద్దిపాటి వాటాను కూడా మనం సవ్యంగా అనుభవించకుండా పాకిస్తాన్ ఇంతకాలమూ అర్థంలేని యాగీలతో అడ్డుపడుతున్నది. పడమటి నదుల మీద 36 లక్షల ఎకరపు అడుగుల మేర నీటిని నిలవ చేసుకోవడానికి ఒప్పందం మనకు అవకాశం ఇచ్చినా ఇప్పటి దాకా మనకు స్టోరేజి అనేదే లేదు. మన వాటా జలాల్లో ఇరిగేషనుకుగల హక్కునూ మనం వాడుకున్న పాపాన పోలేదు. శ్రీనగర్ - అనంతనాగ్ - బారాముల్లాల జల రవాణాను పెంపొందించి, సేద్యపు అవసరాలు తీర్చగల తుల్‌బుల్ ప్రాజెక్టును 1987లో భారత ప్రభుత్వం మొదలు పెట్టి కూడా పాకిస్తాన్ రంకెలకు భయపడి పని ఆపేసింది.

పాకిస్తాన్‌కు శాస్తి చేయాలంటే కొంతమంది తెలిసీ తెలియక ఉచిత సలహాలు ఇస్తున్నట్టు సింధు నీటి ఒప్పందానే్న ఏకపక్షంగా రద్దు చేయనక్కర్లేదు. నదీ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు. దిగువకు పారకుండా బలవంతంగా అడ్డుకుంటే ఎగువ ప్రాంతమే వరద పోటెత్తి మునుగుతుంది. అర్ధశతాబ్దంగా అమల్లో ఉన్న ఒప్పందాన్ని తుంగలో తొక్కామన్న చెడ్డపేరు మనకెందుకు? ఆ ఒప్పందం ప్రకారం మనకు దఖలు పడ్డ హక్కులను మనం పూర్తిగా వినియోగించుకుని తీరుతామని ప్రకటిస్తే చాలు. ఇప్పటిదాకా నోరు పెట్టుకుని బతుకుతూ నదీజలాలను తేరగా వాడుకుంటున్న పాకిస్తాన్ గుండెల్లో రాయపడుతుంది.

మోదీ ప్రభుత్వం ఇప్పుడు తలపెట్టింది సరిగ్గా అదే. నీరు, నెత్తురు కలిసి ప్రవహించజాలవని జనాంతికంగా హెచ్చరిక వదిలినా, సింధు ఒప్పందం యథావిదిగా కొనసాగుతుందని ప్రభుత్వం తేటతెల్లం చేసింది. అదే సమయంలో ఆగిపోయిన తుల్బుల్ ప్రాజెక్టును, బుర్సార్, పాకాల్ దుల్, సవాల్ కోట్ హైడల్ ప్రాజెక్టులను మనకున్న హక్కుల మేరకు చేపట్టి తీరుతామనీ ప్రకటించింది. టెర్రర్‌దాడులకు పాల్పడుతూ పాకిస్తాన్ మనకు తీరని హాని తలపెడుతున్నప్పుడు ఆ ఆగడాలు ఆగేదాకా సింధు నదీ జలాల వాడకానికి సంబంధించి ఆర్నెల్లకోసారి జరిగే కమిషనర్ల భేటీకి మనం హాజరు కారాదనీ నిర్ణయించింది.

ఇందులో ఏ నిర్ణయమూ అంతర్జాతీయ ఒప్పందాల నియమాలకు విరుద్ధం కాదు. ఇలా ఎందుకు చేశారని ప్రపంచంలో ఏ ఒక్కరూ మనలను వేలెత్తి చూపలేరు. వెనకటి ప్రభుత్వాలవలె పిరికితనం చూపకుండా మన న్యాయబద్ధ హక్కులను మనం నిలబెట్టుకుంటే చాలు. తెంపరి విరోధికి కాళ్లు చేతులు వణుకుతాయి. ఈ సంగతి పాకిస్తాన్‌లో ఇప్పటికే లేచిన గంగవెర్రులను చూస్తేనే అర్థమవుతుంది.

ఇనే్నళ్లూ పాకిస్తాన్ ఎజండా ప్రకారం కథ నడిచింది. ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. తుపాకుల యుద్ధానికంటే శక్తివంతమైన జల యుద్ధం ఇప్పుడే మొదలైంది. అసలు సినిమా ముందుంది.

-ఎం.వి.ఆర్  శాస్త్రి

(ఆంధ్ర భూమి సౌజన్యం తో )

No comments:

Post a Comment