ఏ'మార్చే' మతం - ఆంధ్ర జ్యోతి కథనాలు
హైదరాబాద్, నవంబర్ 9 : క్రైస్తవ మత వ్యాప్తికి మనదేశంలో 18 ప్రధాన సంస్థలు పనిచేస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 45 సంస్థలున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి, మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, కడప జిల్లాలు కేంద్రంగా మత మార్పిళ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో ఇప్పటికే పది శాతం మందిని మతం మార్చినట్లు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి హిందూ సంస్థలు చెబుతున్నాయి.
మత ప్రచార సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్‌దే అగ్రస్థానం. మన రాష్ట్రాన్ని రెండుగా విభజించి మత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్-1 కేంద్రంగా 29, ఆంధ్రప్రదేశ్-2లో 77 సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ రెండింటికి అనుబంధంగా 205 సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద సంస్థలు. ఇక చిన్న చిన్న సంస్థలు చాలానే ఉన్నాయి.
ఆపరేషన్ 'ఏడీ 2000'
వంద కోట్లకు పైబడిన జనాభా... ఇందులో అత్యధికులు 'అన్య మతస్థులు'! దీంతో అంతర్జాతీయ మిషనరీలు భారత్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. భారత్‌లో మిషనరీల కార్యకలాపాలను అనుసంధానిస్తూ, వాటికి అవసరమైన నిధులు అందించేందుకు 'ఏడీ 2000' అనే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. 1995లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 186 దేశాలకు చెందిన మత బోధకులు హాజరయ్యారు. ఇదే 'జాషువా ప్రాజెక్టు'గా పేరుపొందింది.
ఇందులో భారత్‌కు సంబంధించి మూడు ప్రత్యేకమైన వ్యూహాలు రచించారు. అవి... ప్లగ్, ప్రిమ్, నైస్. 'ప్లగ్'లో భాగంగా... ప్రతి భౌగోళిక ప్రాంతానికి అనుసంధానమవుతారు. అక్కడ నివసిం చే ప్రజల ముఖ్యంగా పట్టణాల్లోని పేదల వివరాలు సేకరిస్తారు. 'ప్రిమ్'లో భాగంగా ప్రార్థనలు, పరిశోధనలు, మత ప్రచారం, ప్రజలను సమీకరించటం వంటి కార్యకలాపాలు చేపడతారు. 'నైస్'లో మత మార్పిడుల కోసం ప్రచారకులను ఉపయోగిస్తారు. జాషువా ప్రాజెక్టులో భాగంగా అమెరికాకు చెందిన అనేక మంది వ్యూహకర్తలు భారత్‌కు వచ్చి ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేశారని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం వీరు సేకరించిన సమాచార విస్తృతిని చూసి నిఘా సంస్థలే ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. జాషువా మొదటి దశ పూర్తయిందని... ఇప్పుడు 'జాషువా-2' నడుస్తోందని తెలుస్తోంది. ఈ వివరాలతో 'తెహల్కా' పత్రిక తాజాగా 'టాప్ సీక్రెట్' పేరిట ఒక ప్రత్యేక పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఒకప్పుడు క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యేవి. తర్వాత డెల్టాకూ విస్తరించాయి. మిషనరీలు సేవా మార్గంలో ప్రస్థానిస్తూ అదే స్థాయిలో మతాన్నీ విస్తరిస్తున్నాయి.
రాష్ట్రాల స్థాయిలో...
మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిసా, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాలు మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. వాస్తవానికి, బ్రిటిష్ ఇండియాలో దీనిపై ఎటువంటి చట్టాలు లేవు. రాయగఢ్, ఉదయ్‌పూర్‌వంటి కొన్ని రాజ సంస్థానాలు మాత్రం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయి. స్వతంత్ర భారతంలో... 1954లో ఇండియన్ కన్వర్షన్ (రెగ్యులేషన్ అండ్ రిజిస్ట్రేషన్) బిల్లును, 1960లో బ్యాక్ వర్డ్ కమ్యూనిటీస్ (రిలిజియస్ ప్రొటెక్షన్) బిల్లు ప్రవేశపెట్టారు.
వీటికి పార్లమెంటులో తగిన మద్దతు లభించకపోవడంతో వాటిని ఉపసంహరించుకున్నారు. 1979లో ప్రతిపాదించిన మత స్వేచ్ఛ బిల్లును కూడా తర్వాత ఉపసంహరించుకున్నారు. ఇక రాష్ట్రాల విషయానికి వస్తే... ఒడిసా, మధ్యప్రదేశ్‌లు మత స్వేచ్ఛపై 1968, 1969లలో రెండు చట్టాలను చేశాయి. 1978లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ తరహా చట్టాన్ని చేశారు. 2002లో తమిళనాడు అసెంబ్లీ కూడా బలవంతపు మత మార్పిడిని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా చర్చిలు 22,000 పత్రికలు, 1890 రేడియో, టీవీ స్టేషన్లను నడుపుతున్నాయి. ం మలేసియాలో ఉన్న హిందువులలో 75 శాతం మంది వచ్చే ఐదేళ్లలో మతం మార్చుకుంటారని ఒక అంచనా.
నేరము..శిక్ష
బలవంతంగా మత మార్పిడి చేయడం భారతీయ శిక్షా స్మృతి కింద నేరం. బలవంతపు మత మార్పిడికి పాల్పడిన వారిపై ఐపీసీ 295ఏ, 298 కింద చర్యలు తీసుకోవచ్చు. ఈ కేసుల్లో నేరం రుజువైతే దోషులకు కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించవచ్చు. ఒడిసా, మధ్యప్రదేశ్ చేసిన చట్టాల ప్రకారం... చిన్నపిల్లలను, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను బలవంతంగా మత మార్పిడి చేసినట్లు తేలితే వారికి శిక్షను రెట్టింపు చేయవచ్చు. ఒక మతానికి చెందిన పుణ్యక్షేత్రంలో ఇతర మతస్థులు ప్రచారం చేయడం నేరం. ఐపీసీ 153(ఎ) ప్రకారం... రెండు వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించేలా ప్రసంగించినా, రెచ్చగొట్టినా చర్యలు తీసుకోవచ్చు.
ఆమె పేరు రామలక్ష్మి. సొంతవూరు శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి. భర్త రాజారావు తాగుడుకు బానిసై 12 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఇద్దరు పిల్లలను పోషించేందుకు రామలక్ష్మి నాలుగు ఇళ్లలో పాచి పని చేయడం మొదలుపెట్టింది. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేక... వారిని చదివించలేక సతమతమవుతున్న ఆమెను క్రైస్తవ మత ప్రచారకులు ఆకర్షించారు. 'నీ బిడ్డలను చదివిస్తాం' అన్నారు. రామలక్ష్మి... ఇప్పుడు మేరీగా మారింది. ఇద్దరు కుమారులు మిషినరీ స్కూల్‌లో చదువుతున్నారు. మేరీ అలియాస్ రామలక్ష్మి జీవితం గతంలోకంటే మెరుగుపడింది! మరి... రామలక్ష్మి మతం మారడాన్ని ఎలా తప్పు పట్టగలం? ఎక్కడుంది మూలం?
Courtesy : Andhra Jyothy
Courtesy : Andhra Jyothy
No comments:
Post a Comment