జర్నలిస్టుల సమావేశంలో ప్రసంగిస్తున్న మా.శ్రీ సూర్యనారాయణరావుగారు, ప్రక్కన ఆసీనులైన ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు శ్రీ ఎమ్.వి.ఆర్.శాస్త్రి గారు |
హైదరాబాద్, డిసెంబర్ 14: భారతదేశం గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే స్వామి వివేకానందను చదవాల్సిందేనని అఖిల భారతీయ కార్య కారిణి సదస్య (ఆర్‌ఎస్‌ఎస్) కె. సూర్యనారాయణ రావు పేర్కొన్నారు.
నగరంలోని ఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం సంఘ్ అభిమానులతో ఆయన మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనా విధానం వివేకానందుడి ఆలోచనా విధానమేనని అన్నారు. బ్రహ్మశ్రీ, రాజశ్రీ కలిపితే వివేకానందుడు అవుతాడని, రామకృష్ణ మఠం బ్రహ్మశ్రీ అయితే ఆర్‌ఎస్‌ఎస్ రాజశ్రీకి ప్రతిరూపం అవుతాయని ఆయన అభివర్ణించారు. ఆలోచనల ఉద్యమాలకు ప్రతిరూపమే వివేకానంద అని జవహర్‌లాల్ నెహ్రూ అన్నారని గుర్తుచేశారు.
హిందూ అనే శబ్దం కన్నా గొప్ప శబ్దం మరొకటి లేదని అన్నారు. జర్నలిజంలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం లభిస్తాయని దాంతో ధైర్యం వస్తుందని, అదే ధైర్యంతో వివేకానందుడు పనిచేశాడని అన్నారు. మాట్లాడటం కోసం, దేశం కోసం సత్యాన్ని ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. వివేకానందుడు ఎక్కడ పర్యటించినా భారత పునర్నిర్మాణం కోసమే కృషి చేశారని, ‘వివేకానంద హోదా’లో నరేంద్రుడు 9 ఏళ్లు మాత్రమే జీవించినా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రామకృష్ణ మఠం స్థాపించినపుడు ‘బైలాస్’లో మతంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపారని, ముస్లింల వల్ల, మత మార్పిడి, దాడులు తదితర కారణాలతో హిందూ మతస్థుల సంఖ్య 60 కోట్ల నుండి 20 కోట్లకు తగ్గిందని వివేకానంద చెప్పారని అన్నారు. హిందువుల ఔన్నత్యాన్ని మేలుకొలిపేందుకే మఠాన్ని ప్రారంభించారని అన్నారు.
చికాగో ప్రపంచ మత సమ్మేళంలో పాల్గొని గొప్ప ఆకర్షణ శక్తిగా నిలిచారని అన్నారు. భారతదేశాన్ని జాగృతం చేయడమే గాక, అమెరికా, ఇంగ్లాండ్‌లో యోగా, వేదాంత శాస్త్రాలను తమ ఉపన్యాసాల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేసి అఖండ ఖ్యాతి పొందారని అన్నారు. గురువు కోరిక మేరకు అమెరికా వెళ్లి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారని చెప్పారు. పాశ్చాత్య తత్వశాస్త్రాన్ని కూడా ఔపోసన పట్టిన నరేంద్రుడి జీవితంలో ముఖ్య ఘట్టాలను సూర్యనారాయణ రావు వివరించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రతికా విలేకరులు |
రామకృష్ణ పరమహంసతో వివేకానందుడి పరిచయం, తండ్రి మరణం, విదేశీ పర్యటనలు, సిస్టర్ నివేదిత తదితర అంశాలను వివరించారు. నరేంద్రుడు తన మిత్రులతో కలిసి రామకృష్ణ పరమహంసను కలిసేందుకు వెళ్లినపుడు ఎదురైన సంఘటనలను సూర్యనారాయణ రావు ఆసక్తికరంగా వివరించారు. నరేంద్రుడు తన స్నేహితులతో పాటు ఒక మూల కూర్చుని వారి సంభాషణలు ఆలకిస్తుండగా, రామకృష్ణ పరమహంస దృష్టి అతడి మీదకు వెళ్లిందని, దాంతో వెంటనే నరేంద్రుడి మనసులో కల్లోలం మొదలైందన్నారు. కొద్దిసేపటి తర్వాత నరేంద్రుడిని తన గదికి తీసుకువెళ్లి చిన్నగా భుజం మీద తట్టి ఆయనతో ‘ఇంత ఆలస్యమైందేం? ఇన్ని రోజులుగా నీ కోసం చూసి చూసి అలసిపోయాను, నా అనుభవాలన్నింటినీ సరైన వ్యక్తితో పంచుకోవాలనుకున్నాను, నీవు సామాన్యుడివి కావు, సాక్షాత్తూ భువికి దిగివచ్చిన దైవస్వరూపుడవు, నీ గురించి నేనెంత తపించానో తెలుసా?’- అని రామకృష్ణ పరమహంస కన్నీటి పర్యంతమయ్యారని వివరించారు.
‘మన దేశంలోనే మానవ హృదయం అతి విశాలమైన అనంత విస్తృతిని పొంది, తోటి మానవ జాతినే కాక పశుపక్ష్యాదులతో పాటు సమస్త ప్రాణకోటి చేత సర్వ జగత్తు తనతోనే ఉన్నట్టు భావన చేయగిలింద’ని భారత దేశం గొప్పదనాన్ని వివేకానందుడు వర్ణించేవారని సూర్యనారాయణ రావు పేర్కొన్నారు.
No comments:
Post a Comment