15 March, 2014

నిర్ణేతలు మీరే


అవినీతి పాలన దేశానికి చేటు
నాయకత్వ పటిమకే మన ఓటు
వారసత్వ రాజకీయాలను తిప్పికొట్టండి !
నిజమైన నేతకే పట్టం కట్టండి !

ఈ సారి మీరు వేసే ఓటు దేశానికి చేటు తెచ్చిపెట్టిన విచ్ఛిన్నకర శక్తులపై వేటు కావాలి. మీ ఓటు జాతి పునరుత్థానానికి బంగరు బాటలు పరచాలి. దేశ భవిష్యత్తు విధాతలు మీరే. 





సుదీర్ఘ జాతీయోద్యమ ఫలితంగా, ఎన్నో బలిదానాల మూలంగా మనకు స్వాతంత్ర్యం వచ్చినా ఆ స్వాతంత్ర్య ఫలాలు సామాన్యులకు దక్కలేదు. దేశం అన్ని రంగాలలోనూ ప్రగతి సాధించాలనీ, సాటి దేశాల సరసన సగర్వంగా, అజేయంగా నిలవాలనీ మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ వంటి మన జాతీయ నేతలు తలచారు. కానీ వారి ఆకాంక్ష నెరవేరలేదు. స్వాతంత్ర్యం వచ్చాక గడచిన గత ఆరున్నర దశాబ్దాలలో దేశం దిశావిహీనమైంది. అన్నివైపుల నుండి చట్టుముట్టిన సవాళ్లతో నేడు జాతి తల్లడిల్లుతోంది. కనీసం సరిహద్దులను సైతం కాపాడలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మౌలికమైన దేశభద్రతనే పెను ప్రమాదంలోకి నెట్టేసింది.

అంతర్గత భద్రతకు పెనుముప్పు 




ఉగ్రవాదం విచ్చలవిడిగా పెచ్చరిల్లి అంతర్గత భద్రతనే ప్రశ్నార్థకం చేసింది. ముంబై కిరాతకులు, దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల నుంచి నిన్న మొన్నటి బుద్ధగయ, పాట్నా విస్ఫోటనాల వరకు టెర్రరిస్టులు చెప్పి మరీ బాంబులు పేల్చినా ప్రభుత్వంలో చలనం లేదు. చర్యలు లేవు.  

పైపెచ్చు ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు ముస్లిం యువకులను అరెస్టు చేయరాదని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే రాష్ట్రాలకు 2013 సెప్టెంబర్ 30న అడ్డగోలు ఆదేశాలు జారీ చేయటం మైనారిటీల సంతుష్టీకరణ విధానానికి పరాకాష్ఠ. 



పోటా చట్టం ఎత్తివేసి దేశద్రోహులను వదిలేస్తూ వచ్చిన ప్రభుత్వం, శాంతి కాముకులైన అమాయక హిందువులపై తీవ్రవాదులనే ముద్ర వేసి కత్తి గట్టినట్లు వ్యవహరించడం విడ్డూరం. దేశంలో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులను చేయడానికే వివాదాస్పద మతహింస బిల్లుకు రూపకల్పన చేశారన్నది ఒక వాస్తవం. 

పేదలంటే మైనారిటీలేనా?  

అల్పసంఖ్యాక వర్గాల ఓట్ల కోసం యుపిఎ ప్రభుత్వం వారు పేదరికానికి ఉండే నిర్వచనాన్ని మార్చేశారు. మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకే దేశ వనరులపై మొదటి హక్కు ఉంటుందని సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ 52వ సమావేశంలో ప్రకటించారు. ఇదెక్కడి న్యాయం? మతాలకు అతీతంగా పేదలంతా ఒకటి కాదా? ముస్లిం మైనారిటీలు మాత్రమే పేదలౌతారా? పేదలు హిందువులై ఉంటే వారికి దేశవనరులపై హక్కు ఉండదా? ఉండకూడదా? 

మతపరమైన రిజర్వేషన్లు  


మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విస్పష్టమైన తీర్పు ఇచ్చినా వివిధ రాజకీయ పార్టీలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేస్తామని పదే పదే హామీలు గుప్పిస్తున్నాయి. ఇది కోర్టు తీర్పు స్ఫూర్తిని కాలరాయడం కాదా? న్యాయ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం కాదా?  

తమ మతపరమైన విశ్వాసాలను తమకే పరిమితం చేసుకోకుండా కొందరు నేతలు బైబిల్ పట్టుకు తిరుగుతూ, తాము అధికారంలోకి వస్తే క్రైస్తవ రాజ్యం తెస్తామంటూ బరితెగింపు ప్రకటనలు చేస్తున్నారు. ఇక అందరికీ చెందిన ప్రభుత్వ నిధుల నుంచి రాష్ట్ర పాలకులు పాత చర్చిల మరమ్మత్తుల కోసం, కొత్త చర్చిల నిర్మాణం కోసం నిధులను అడ్డగోలుగా మళ్లిస్తుంటే హైకోర్టు జోక్యం చేసుకుని ఆపవలసి వచ్చింది. 



మరోవైపు కోట్లాది హిందువులకు ఆరాధ్యదైవమైన తిరుమల వెంకన్న సన్నిధిలో - తిరుపతికి దగ్గరలో - విదేశీ నిధులతో ఏ అనుమతులూ లేకుండా భారీ ఎత్తున ఇస్లామిక్ విశ్వవిద్యాలయం నిర్మాణమౌతున్నా ఆ అక్రమ కట్టడాలను తొలగించడానికి ప్రభుత్వం వెనుకాడుతోంది.  

మన సైనికుల తలలు నరికినా... 



నాడు వాజ్ పాయ్ ప్రభుత్వం పోఖ్రాన్-2 అణుపరీక్షలతో భారత్ శక్తిని ప్రపంచానికి చూపి నాయకత్వ పటిమను చాటారు. కానీ అలాంటి పరీక్షలేవీ ఇకమీదట నిర్వహించబోమంటూ లోలోపల అమెరికాకు హామీ ఇచ్చిన ప్రస్తుత యుపిఎ ప్రభుత్వం దేశభద్రతనే పణంగా పెట్టింది. వాజ్ పాయ్ ప్రభుత్వం కార్గిల్ యుద్ధ విజేతగా నిలిస్తే, ఇప్పుడున్న ప్రభుత్వ హయాంలో పాకిస్తాన్ ముష్కరులు 2013 జనవరిలో నియంత్రణ రేఖను (ఎల్.ఓ.సి.) దాటి వచ్చి మన సైనికులను చంపి, తలలు నరికి కవ్వించినా కదలిక కరువైంది. 



చైనా దూకుతున్నా...
 

మరోవైపు దుందుడుకు చైనా సైనిక మూకలు 2013 ఏప్రిల్ లో భారత సరిహద్దులను అతిక్రమించి ఏకంగా 19 కిలోమీటర్లు లోపలకు చొచ్చుకువచ్చి లడఖ్ లోని డెప్సాంగ్ లోయలో దర్జాగా టెంట్లు వేసుకుని మన దేశ సార్వభౌమత్వానికి సవాలు విసిరినా యుపిఎ ప్రభుత్వం కిమ్మనకుండా మిన్నకుండి పోయింది. ప్రస్తుత నాయకత్వానికి జాతీయ దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే రాజనీతిజ్ఞత, ధైర్య సాహసాలు కొరవడటంతో సర్వత్రా నైరాశ్యం నెలకొంది. నైతిక స్థైర్యం సడలింది. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుండి వివిధ యుద్ధాలలో సుమారు 80 వేల మంది సైనికులు నేలకొరిగినా నివాళులర్పించేందుకు ఇప్పటి వరకు మనకు ఢిల్లీలో స్థిరమైన నేషనల్ వార్ మెమోరియల్ (యుద్ధ స్మారకం) అన్నదే లేకపోవడం సిగ్గుచేటు కాదా !  

అవినీతి కూపం, దేశానికి శాపం 




ప్రభుత్వ వైఫల్యం మూలంగా అన్ని రంగాలలోను సంక్షోభం నెలకొంది. అవినీతికి అడ్డన్నదే లేకుండా పోయింది. గత పదేళ్ల ప్రభుత్వ పాలన మొత్తం స్కాముల పాముల పుట్ట. ప్రభుత్వ పెద్ద లంచావతారంలా తయారైంది.  

2జి స్కామ్ లో ప్రభుత్వ ఖజానాకు 1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. ఈ కేసులో టెలికం మంత్రి ఎ.రాజా పదిహేను నెలలకు పైగా జ్యుడిషియల్ కస్టడీలో ఉండి తీహార్ జైలు ఊచలు కూడా లెక్కించారు.
 

బొగ్గు స్కామ్ లో ఏకంగా రూ.1.86 లక్షల కోట్లు స్వాహా చేశారు. దీనిని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బయటపెట్టింది. బొగ్గు మసి మరక సాక్షాత్తూ ప్రధానికే అంటింది. ఈ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని సుప్రీంకోర్టు మండిపడి ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో అభిశంసించింది కూడా.   

ఇక రైల్వే బోర్డు స్కామ్, ఆదర్శ్ సొసైటీ స్కామ్, కామన్వెల్త్ క్రీడల స్కామ్, టట్రా మిటలరీ ట్రక్ స్కామ్, మరో బోఫోర్స్ వంటి అగస్టా వెస్ట్ లాండ్ హెలీకాప్లర్ల స్కామ్...    

ఇలా యుపిఎ సర్కార్ కుంభకోణాలకు అంతే లేకుండా పోయింది. ఇలా ఈ ప్రభుత్వ పాలనలో లక్షల కోట్ల ప్రజాధనం లూటీ అయింది. 



అదుపు తప్పిన ధరలు 


ఆర్థిక రంగంలోనూ ఘోర వైఫల్యమే. దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నా, పేదరికం పెను మంటలు రేపుతున్నా పాలకులకు పట్టలేదు.  

వంటగ్యాస్, పెట్రోల్, ఇతర నిత్యావసర సరకుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజూ వాడుకునే ఉల్లిగడ్డల ధర 278 శాతం పెరిగింది. ఒక దశలో కిలో ఉల్లిగడ్డ ధర వంద రూపాయలకు చేరింది.  

ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో సగటున రోజుకు 46 మంది రైతులు ఉసురు తీసుకుంటున్నారు. సంక్షోభాన్ని నివారించవలసిన ప్రభుత్వం ఆహారం, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీలను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం దారుణం.  


సామాన్యుల నడ్డి విరిచేలా సబ్సిడీ సిలిండర్లపై ఆంక్షలు పెట్టారు. సబ్సిడీ లేని వంటగ్యాస్ సిలిండర్ ను రూ.1327 చెల్లించి కొనుక్కోక తప్పని పరిస్థితి వచ్చింది. 2003లో రూ.36 మాత్రమే ఉన్న పెట్రోల్ ధర 2014 మార్చిలో రూ.87 దాటిపోయింది.    

మరోప్రక్క మన రాష్ట్రంలో కరెంటు చార్జీల పేరుతో సుమారు రూ.30వేల కోట్ల పెనుభారాన్ని ప్రజలపై మోపారు. ఎడాపెడా బస్సు చార్జీలు కూడా పెంచారు. రైలు ఎక్కుదామన్నా ఆ చార్జీలు సైతం 22శాతం పెరిగాయి.  


మహిళలకు రక్షణ కరవు 


దేశంలో మహిళలకు కనీస రక్షణ కరువైంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 2012 డిసెంబర్ లో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచారం ఇందుకు ఒక ఉదాహరణ. మన రాష్ట్రంలోని తెనాలిలో 2013 ఏప్రిల్ లో కళ్లెదుట కన్నకూతురిపై అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు ఒక దళిత మహిళ దుండగుల దాడిలో నిలువునా బలైంది. ఈ పాశవిక ఘటనలు పరిస్థితుల తీవ్రతను తెలుపుతున్నాయి. దేశంలో ఒక్క 2012లోనే 24,923 అత్యాచార ఘటనలు జరిగాయి. సగటున ప్రతి 22 నిమిషాలకు దేశంలో ఒక అత్యాచారం జరుగుతోందంటే ప్రభుత్వ అలసత్వమే దీనికి కారణం.   

కుటుంబ పాలనకు కాలం చెల్లింది ! 

ముందుండి ప్రేరణదాయకమైన నాయకత్వం అందించవలసిన ప్రధానమంత్రి లోక్ సభ నుండి కాకుండా రాజ్యసభ నుండి ప్రాతినిధ్యం వహించడం దేశానికి శాపం. జాతికి కావలసింది అమ్మ చెపితే నడిచే కీలుబొమ్మ వంటి సారథి కాదు. ప్రధాని అంటే తెరవెనుక శక్తులు శాసిస్తే నోరు మెదపక పాటించే తోలుబొమ్మ కారాదు. 


ఇంతవరకూ వారసత్వ రాజకీయాలతో దేశాన్ని నిస్తేజం చేసినవారే ఇప్పుడు 'యువ ఉత్తేజం' అనీ, 'నేను కాదు మనం' అనీ కాపీ నినాదాలతో మళ్లీ అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. ఈ దేశం నేడు ఇంత దుర్దశలో ఉండడానికి కారకులైన వారు వందల కోట్లు వెచ్చిస్తూ అడ్వర్టైజ్ మెంట్లతో ఊదరగొడుతున్నారు. కుటుంబ పాలనతో తిరిగి భస్మాసుర హస్తం మన నెత్తిన పెడతామంటున్నారు.




చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వాడు నాయకుడు కాదు, నాయకుడంటే జనం నుండే రావాలి. ప్రజల గుండె చప్పుడు వినాలి. నేటి క్లిష్ట పరిస్థితులలో దేశానికి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే గట్టి లీడర్ కావాలి. నరనరాల దేశభక్తి నిండిన జాతీయ నేత కావాలి. నిష్కళంకుడైన రాజనీతిజ్ఞుడు, సుపరిపాలనతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దార్శనికుడు కావాలి. బంకింబాబు వందేమాతర గీతానికి సార్థకత సంతరించి పెట్టే సారథి రావాలి. తన పరిపాలనా సామర్థ్యాన్ని రుజువు చేసుకున్న ధీటైన నాయకుడు నేటి అవసరం.  

దానికి సమయం ఆసన్నమైంది. 2014 సార్వత్రిక ఎన్నికలు అందుకు అందివచ్చిన ఒక మంచి అవకాశం. 




దేశంలో కొత్త గాలులు 

సమర్థత, స్వచ్ఛత, యోగ్యత, దార్శనికత, ప్రగతిశీలత, సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న నాయకత్వాన్ని బలపరచండి ! దేశాన్ని అన్నిటా అగ్రగామిగా ప్రపంచ పటంలో నిలిపే పరిపాలనా వేత్తకు అండదండలుగా నిలవండి ! ఈ ఘోరమైన పాలనకు ఇక గోరీ కట్టండి !  

బాబా రామ్ దేవ్, కిరణ్ బేడీ, జనరల్ వికె సింగ్ తదితర సామాజిక ఉద్యమకారులు పరిపాలనలో మార్పు కోరుతున్నారు. దేశమంతా కొత్తగాలులు వీస్తున్నాయి. మూణ్నాళ్ల మూడో ఫ్రంట్ అయినా, ప్రచార ఆర్భాటాల ఆమ్-ఆద్మీ పార్టీ అయినా మఖలో పుట్టి పుబ్బలో పోయేవే. చివరకు అవన్నీ కాంగ్రెస్ చేతుల్లో కీలుబొమ్మలే.   

కనుక స్థిరమైన ప్రభుత్వాన్ని అందించగలిగే నిజమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటేనే దేశ పరిస్థితులు చక్కబడతాయని గ్రహించాలి. 
 


  • ఈ సారి మీరు వేసే ఓటు దేశానికి చేటుతెచ్చిపెట్టిన విచ్ఛిన్నకర శక్తులపై వేటు కావాలి. మీ ఓటు జాతి పునరుత్థానానికి బంగరు బాటలు పరచాలి !
  • జాతీయ దృక్పథంతో ఆలోచించి మార్పు కోసం తీర్పు ఇవ్వండి !
  • ఈ పర్యాయం ఒక పూజా పుష్పంలా మీ ఓటును భారతమాత సమార్చనకు సమర్పించండి !!
  • దేశ భవిష్యత్తు విధాతలు మీరే !!
  • జైహింద్ !!!

మీరు మార్పు కోరుకునే వారైతే 0 78200 78200 నంబర్ కు మిస్డ్ కాల్ (missed call) ఇవ్వండి. 

ఇదే నంబరుకు మీ వోటర్ ఐడి నంబరు ఎస్.ఎమ్.ఎస్. చేయవచ్చు.   

అందరూ రండి ! ఓటు వేయండి !!
 

- వి.రామకృష్ణ, ఇండియా ఫస్ట్
Source : Lokahitham.net

No comments:

Post a Comment