సాక్షాత్తూ దైవాంశ సంభూతులు ..
శ్రీ శైవ పీఠాధీశ్వరులు....మహామహోపాధ్యాయ పరమపూజ్య
శ్రీ శైవ పీఠాధీశ్వరులు....మహామహోపాధ్యాయ పరమపూజ్య
శ్రీ శ్రీ శ్రీ సద్గురు శివానంద మూర్తి గారు
ఈ తెల్లవారుజామున 1-55 గంటలకు
కైలాసప్రాప్తి చెందారు ... వారి అంతిమ సంస్కారాలు వరంగల్ లోని
పూజ్య గురుదేవుల ఆశ్రమంలో ఈ రోజు సాయంత్రం జరుగుతాయి .... మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు భక్తులకు దర్శనం ఉంటుంది ...
సనాతన ధర్మసారథి, శ్రీశైవ మహా పీఠాధిపతి, మహామహ•పాధ్యాయ సద్గురు డా.శ్రీ కందుకూరి శివానందమూర్తి
సద్గురు కందుకూరి శివానందమూర్తి మహ•దయులు కదిలివస్తుంటే వేయివెన్నెలల చల్లదనం వ్యాపిస్తుంది. గురుదేవుల కన్నుల్లో కరుణ రస సాగరాలు ఉన్నాయనిపిస్తుంది. గురువుగారి అనుగ్రహ భాషణలు మనసుల్లో ఆధ్యాత్మిక అనుభూతుల మల్లెల్ని పూయిస్తాయి. స్వార్థమే పరమార్థంగా కొనసాగే ఈ ప్రపంచపట చిత్రంలో పరహితమే పరమ సంకల్పంగా మార్చుకున్న ఆధునిక తథాగతుడు సద్గురు శివానందమూర్తి. ఆపద్బాంధ•వుడుగా, అనాథ రక్షకుడుగా లక్షల శిష్యస్వరాలు గురుదేవులను నిరంతరం స్మరిస్తాయి.
వీరి దృష్టిలో గురువే దైవం, దైవమే గురువు. జాతి గత వైభవ స్ఫూర్తి. మూర్తీభవించిన మూర్తి సద్గురు శివానందమూర్తి. ఆయన నిన్నటి సాంస్కతిక స్వర్ణ స్మతుల వ్యాఖ్యాత. ఆయన ఆధునిక యుగంలో సనాతన ధర్మప్రచారం చేస్తున్న ప్రవక్త. ఆయన నిలువెత్తు జాతీయాదర్శం. ఆయన నిరాడంబరతకు నిదర్శనం. ఆయన కోరినవారి కోరికలు తీర్చి తనకేమీ కోరుకోని నిర్లిప్త చిన్మయ తేజం. గత కాలపు సౌరభాలకు, మన యుగపు మంచితనానికి రేపటి జాతి ఘనతకు సతార్కిక సేతువు నిర్మిస్తున్న అద్భుత స్రష్ట గురువుగారు.మంత్రవేత్త, తత్త్వ వేత్త, శాస్త్రవేత్త, సాహితీవేత్తల తమ సమ్మేళనమైన సాక్షాత్ శ్రీ ద•క్షిణామూర్తి స్వరూపులు సద్గురు శివానందమూర్తి .
‘సద్గురు’ శబ్దాన్ని సార్థకం చేసిన జ్ఞానమూర్తి, అచ్చమైన మానవతావాది డా.శ్రీ కందుకూరి శివానంద మూర్తి గారు.అసంఖ్యాక శిష్యులు అభిమానులు ఉన్న సద్గురు శివానందమూర్తిగారి ఆవాసం విశాఖపట్నం సమీపంలోని భీముని పట్నంలోని ఆనందవనం ఆశ్రమం. సర్వమంగళ, వీరబసవరాజు వీరి జననీజనకులు. పరమ శివభక్తులైన వీరు దాదాపు 200లకు పైగా శివాలయాలు నిర్మించారు. శివానందులు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక విషయాలపట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం అంటే మిక్కిలి ఆసక్తి కనపరచేవారు. అటు ఉద్యోగ ధర్మం, ఇటు పేదల సహాయానికి, ధర్మబోధనకు మిక్కిలి ప్రాధాన్యమిచ్చిన సవ్యసాచి. అధికారిగా స్వచ్ఛంద పదవీవిరమణ అనంతరం సాంస్కతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సేవా రంగాలలో బహుముఖీన సేవలందించటానికి పూనుకున్నారు.
మహోన్నత భారతీయ సంస్కతి పట్ల, ఆర్ష ధర్మ సంరక్షకులుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలన్న లక్ష్యంతో వారు నిర్వర్తిస్తున్న కృషి అమోఘం. కవిపండిత పోషణ, కళాకారులకు, గ్రంథ ప్రచురణకు ఆర్థిక సహాయమందించటం వారికి నిత్యకృత్యం అయింది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా...అన్నట్లు ప్రాచ్య, పాశ్చాత్య దేశ పర్యటనలలో మన ప్రాచీన సంస్కతీ వైభవాన్ని ఎలుగెత్తి చాటుతున్న సాంస్కతిక ప్రతినిధి. దేశం నలుమూలలా వందలాది అనుయాయులతో పర్యటించి దేశసంక్షేమం, సంస్కతీ వికాసం సంకల్పిస్తూ 200లకు పైగా యజ్ఞాలు నిర్వహించారు. సాహిత్య, సంగీత, నాటక, చరిత్ర, నాటకాదులపై వీరి వైదుష్యం ఎన్నదగినది. ఇలాంటి విషయాలలో వీరొక ‘చరత్ విజ్ఞాన సర్వస్వం’ అంటే అతిశయోక్తి కాదు. భారత రాజకీయ, సాంస్కతిక, ఆధ్యాత్మిక చరిత్ర మీద వీరి వ్యాసాలు ధారావాహికంగా పలుపత్రికల్లో ప్రచురితమై, ‘‘భారతీయత’’ పేరున 2 సంపుటాలుగా వెలువడ్డాయి.
కఠోపనిషత్ మీద రాసిన ‘‘కఠయోగ’’ గ్రంథం శృంగేరీ, కంచిపీఠాధిపతుల మన్ననలందుకొన్నది. అద్వైతం, జ్ఞానం, యోగం దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ట వ్యక్తి శ్రీ శివానందమూర్తి అని పాశ్చాత్య తత్త్వవేత్త ‘‘డేవిడ్ ఫ్రాలే’’ ఈ గ్రంథం ముందు మాటలో పేర్కొన్నాడు.
హిందూ వివాహ వ్యవస్థ (2006), మహర్షుల చరిత్ర (2007), గౌతమ బుద్ధ (2008) ‘శ్రీకృష్ణ’ (2012) వీరి ఇతర రచనలు. సరైన జీవన విధానం పట్ల సామాన్యునికి మార్గదర్శనం చేస్తూ రాసిన వ్యాసాలు 500కు పైగా పత్రికల్లో వచ్చాయి. కావ్య, పురాణ, సాహిత్య గ్రంథాల ఆధారంగా ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి ‘మనకథ’ పేర గ్రంథస్థం చేశారు. అది హైదరాబాద్ దూరదర్శన్‌లో 13 భాగాలు ప్రసారమయ్యింది. ‘సనాతన ధర్మ
ఛారిటబుల్ ట్రస్టు’కు ఆయన ప్రధాన ధర్మకర్త. లలితకళలు, సాంకేతిక విజ్ఞానం, వైద్యం, జర్నలిజమ్, మానవీయ శాస్త్రాలు మున్నగు రంగాలలో కృషి చేసిన వారిని, ఈ ట్రస్టు తరఫున సన్మానిస్తున్నారు.
భారతీయ సంప్రదాయిక సంగీత నాట్యాలను ప్రోత్సహించేందుకు ‘ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ’ స్థాపించారు.
ప్రతి యేటా ఈ అకాడమీ ఘనంగా సంగీతోత్సవాలు జరుపుతోంది. ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునిక రికార్డింగ్ స్టూడియో నిర్మించారు. సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధితో ఆచరిస్తేమన దేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని, ఆత్మ గౌరవం ఇనుమడిస్తుందని పదే పదే చెపుతూ ఉంటారు. వరంగల్ శివారులో సువిశాల ఆశ్రమాన్ని నిర్మించి అనేక ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీరు శ్రీ శైవ మహా పీఠం అధిపతులుగా విరాజిల్లుతున్నారు.
ఒక శంకరుడు, ఒక వివేకానందుడు, ఒక రమణ మహర్షి.. ఈ కోవలో చేరే పుణ్యమూర్తి సద్గురు శివానందమూర్తి.
ఇట్టి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆధ్యాత్మిక వేత్త ఇక లేరనే నిజం కోట్లాది మందిని కలచి వేస్తోంది ...
సనాతన ధర్మసారథి సద్గురు శివానందమూర్తి గారికి సాష్టాంగ ప్రణామాలతో అక్షరాంజలి సమర్పిస్తోంది
బాధాతప్త హృదయంతో .... గురుదేవుల పాదరేణువు
మరుమాముల వెంకట రమణ శర్మ
సంపాదకులు దర్శనమ్ ఆద్యాత్మిక మాస పత్రిక
No comments:
Post a Comment