కళలో అయినా ఏదో ఒక ఆకట్టుకునే ఆటుండాలి.
పట్టి నిలబెట్టే గట్టి ఘాటుండాలి. బీభత్సమైన బీటుండాలి. గజ్జెకట్టినట్టు
ఘల్లుమనిపించాలి. వెన్నులో ఝల్లుమనిపించాలి. వీరంగం వేసేవారు లేకుంటే రంగం
రసహీనమైపోదూ!
ఒక్క కళ కళకళలాడడానికే ఇన్నుండాలంటే, మరి నవరసాల సమ
సమాహారమైన చతుర రాజకీయం రక్తి కట్టి, రంజిల్లడానికి ఎన్నుండాలి? ఎందరు
కావాలి?! దుమ్ములేపాలంటే దమ్మున్న వారు కావాలి కదా!
అందుకే
అనితర సాధ్యమైన ఈ గురుతర బాధ్యతను, సకల లోకాలను సర్వ సమానంగా చూసే
లౌకికవాద ఛాంపియన్లు, భూభాగ సరిహద్దులకు అతీతంగా భూత దయ చూపే భౌతిక వాదులు,
అకుంఠిత ప్రపంచ భక్తులు, అపజయ పరంపరను లెక్కచేయకుండా దూసుకెళ్లే అద్వితీయ
పోరాట శక్తులు, జాతి జన మనోభావాలతో నిమిత్తం లేకుండా ముందుకుపోయే సిద్ధాంత
అనురక్తులు అయిన కొందరు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వారందరినీ కలిపి
మూకుమ్మడిగా వామపక్ష వాదులు అంటారు!! పూర్వం రాజుకు ఎడమ (లెఫ్ట్) వైపు
ఉండేవారు కనుక వారిని లెఫ్టిస్టులు అనేవారట! ఇప్పుడు ప్రజలకు ఎడంగా ఉండేవి
కనుక లెఫ్ట్ (జనం వదలిపెట్టిన) పార్టీలని అంటారు గిట్టనివారు.
కమ్యూనిస్టు
మార్క్సిస్టు రష్యా, మావోయిస్టు చైనాలు ఈ పార్టీల మాతృ దేశాలు. ఇప్పుడు
రష్యాలో కమ్యూనిజం, చైనాలో మావోయిజం, నేతి బీరకాయలో నెయ్యంత ఉన్నాయి.
సిద్ధాంత రాద్ధాంతాలు దాటి ఆ రెండు దేశాలూ, మిగతా ప్రపంచంతో పాటు ఎంతో
ముందుకు, ఎక్కడికో వెళ్లి పోయాయి. కానీ నాటి భావజాలంతో పుట్టిన భారత
వామపక్షాలు మాత్రం పుట్టినచోటే ఆగిపోయాయి. పురిటి వాసననే కొడుతున్నాయి.
వామపక్ష సామూహిక సమారోహంలో మనుషులెందరున్నారో చెప్పవచ్చు. కానీ
పార్టీలెన్నో, సంఘాలెన్నో, వర్గాలెన్నో, మార్గాలెన్నో, పంతాలెన్నో,
పంథాలెన్నో చెప్పలేం. ఏదేమైనా నిరంతర పోరాటశీలురైన వామన వాదులకు కలిసి
ఉండడం నచ్చదు. అందుకే తమలో తామూ కలవరు.వేరేవారినీ కలసి ఉండనివ్వరు. గిరీశం
చెప్పినట్టు, సమాజంలో వర్గాలంటూ ఉంటేనే కదా... వర్గ పోరాటాలు జరపగలిగేది!
వామపక్షవాదులు
దేన్నైనా వ్యతిరేకించగలరు. ఎవరినైనా ధిక్కరించగలరు. స్వాతంత్య్ర పోరాట
సమయంలో మహాత్మాగాంధీని, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్విట్ ఇండియా
ఘట్టాన్ని, సాయుధ పోరాటమే పరిష్కారమని నమ్మిన నేతాజీని, రాజ్యాంగ నిర్మాత
అంబేడ్కర్‌ను... అక్కడిదాకా ఎందుకు? మూడు కోట్ల మంది ముక్తకంఠంతో కోరుకున్న
ప్రత్యేక తెలంగాణను (సీపీఎం)... ఇలా వారువ్యతిరేకించనిది ఏదైనాఉందా?
అలనాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని కొనసాగించాలా? చాలా? అని స్టాలిన్ అనుమతి
అడిగిన సర్వ స్వతంత్రులు వీరు. జనం ఒకవైపుంటే వారు మరోవైపు! ఏదో ఒక దానిపై
పోరాడక ఉండలేని మనస్థితి వాటిది! పోరాడితే పోయేదేముంది మరిన్ని ఓట్లు తప్ప
అన్నది తాజా నినాదం.
ఎప్పుడూ
వ్యతిరేకించడమేనా అని అనుమానపడకండి! వారు గట్టి మద్దతు కూడా ఇవ్వగలరండోయ్!
ఎవరికి? భారతదేశం మీద దండెత్తి వచ్చిన చైనా దళాలకు, దేశం నుంచి
విడిపోతామంటున్న కశ్మీర్ వేర్పాటు వాదులకు, పార్లమెంటుపై, ముంబై నగరంపై
దాడికి దిగిన ఉగ్రవాద సమర్థకులకు, మెడపై కత్తి పెట్టినా భారతమాతకు
జైకొట్టను అన్నవారికి వంత పాడగలరు. అంతెందుకు? ప్రతి భాషా ఒక జాతి అని
సిద్ధాంతీకరించి... ఉర్దూ మాట్లాడేవారు ప్రత్యేక దేశం కోరుకుంటే
సమర్థిస్తామని కూడా ఒక దశలో ప్రకటించారు!
ఈ
దేశంలో వామపక్షాలంత వైవిధ్య వైరుధ్య భరిత సృజనాత్మక ఎన్నికల పొత్తులు,
సిద్ధాంత రచనలు చేసిన పార్టీలు మరొకటి లేవు. మతతత్వ బీజేపీని ఆపడంకోసం
లౌకికవాద కాంగ్రె్‌సతో కలుస్తారు. బూర్జువా కాంగ్రె్‌సను ఆపడం కోసం
బీజేపీతో కలుస్తారు. ప్రజా కంటక వైఎ్‌సపై పోరాడడానికి టీడీపీతో
జట్టుకడతారు. అవినీతిమయ తెలుగుదేశాన్ని అడ్డుకోవడానికి ఎంతో నీతిమంతమైన
వైసీపీతో మిలాఖత అవుతారు. తాజాగా చూడండి. కేరళలో కాంగ్రె్‌సతో పోరాటం.
బెంగాల్‌లో స్నేహం! వారేం చేసినా పొద్దుటికల్లా సిద్ధాం తం సిద్ధమవుతుంది.
కాదూ కూడదంటే.. పదేళ్ల తర్వాతో, పాతికేళ్ల తర్వాతో చెప్పడానికి చారిత్రక
తప్పిదపు క్షమాపణ ఉండనే ఉంది!
తాజా
వ్యవహారాలే చూడండి. ముంబాయిలో 150 మంది పౌరులను కాల్చేస్తే తప్పు కాదు. ఆ
కేసులో నిందితుడైన యాకూబ్ మెమన్‌ను ఉరితీయడం తప్పు. పార్లమెంటుపై దాడి
తప్పు కాదు. ఆ కేసులో నేరగాడుగా సుప్రీంకోర్టు నిర్ధారించిన అఫ్జల్‌గురుకు
ఉరిశిక్ష వేయడం తప్పు. ఈ ఇద్దరికీ మద్దతుగా వర్సిటీల్లో ఊరేగింపులు తప్పు
కావు. వాటిని ప్రశ్నించడం తప్పు. కన్నయ్య కుమార్‌పై లాయర్లు దాడిచేయడం
తప్పు. కానీ గోరక్షా సమితి, బీజేపీ కార్యకర్తల్ని చితక్కొట్టడం తప్పు కాదు.
అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన సుప్రీంకోర్టు విధించిన
మరణ శిక్షల్ని ప్రశ్నించడం తప్పు కాదు. కానీ మేజిసే్ట్రట్ కోర్టుకు
సమానమైన గ్రీన్‌ట్రిబ్యునల్ తీర్పును గురు రవి శంకర్ ఉల్లంఘించడం తప్పు.
ఇది స్వయం ప్రకటిత మేధావుల తీర్పు!
రాజకీయాల్లోనే
కాదు; వ్యక్తిగతంగానూ ఈ వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. మతం వద్దు, గితం వద్దు
అని నినదించిన మార్క్స్ సైద్ధాంతిక పునాదుల మీద నిలబడిన వారు బెంగాల్‌లో
ఓట్ల కోసం చర్చిలు, మసీదుల్ని సందర్శిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం
విధించిన శిక్షల్ని వ్యతిరేకిస్తూనే.. రాజ్యాంగహక్కుల పరిరక్షణ సదస్సుల్ని
నిర్వహిస్తారు. అదేమని మనం అడగ్గూడదు! చైనాలో లక్షలాది మందిని ఖాళీ చేయించి
ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు కడుతున్నారు కదా? ఇక్కడ మీరెందుకు
వద్దంటున్నారు? ఇక్కడ వాదించినట్టే, చైనాకు వెళ్లి, తైవాన్, హాంకాంగ్
చైనావి కాదని వాదించగలరా? వాదించి బతికి రాగలరా?
కొన్ని
ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తాయి.. ఉఫ్ మని చల్లారిపోతాయి.. ఎందుకు?
ఒక్కసారి కూడా కేంద్రంలో పూర్తిస్థాయిలో అధికారంలోకి రాకున్నా వామపక్ష
వర్గీయులకే ఇన్ని అవార్డులు (వాపసీ వల్ల అసలు సంగతి బయటపడింది) ఎలా
వచ్చాయి? ఇంతకాలం మీ ప్రాబల్యమున్న వర్సిటీల్లో కుల వివక్ష ఇప్పటికీ ఎందుకు
కొనసాగుతోంది? లెఫ్ట్ కూటమి అత్యధిక కాలం అధికారంలో ఉన్న బెంగాల్
మంత్రివర్గంలో దళితుల వాటా ఎంత? బడుగులకు ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్
అడిగే మీరు మీ పార్టీ పొలిట్ బ్యూరోలో ఒక్క సీటైనా ఎందుకివ్వరు? వంటి
చొప్పదంటు ప్రశ్నలు మనం వేయకూడదు. ఎందుకంటే ప్రశ్నించే హక్కు వారికే తప్ప
మనకు లేదు! భాషను బట్టి వ్యాకరణం రావాలి. వ్యాకరణాన్ని బట్టి భాష రాదు
అనేవారు పీవీ నరసింహారావు.
లెఫ్ట్ పార్టీలు మాత్రం
ప్రజల కోసం సిద్ధాంతం కాకుండా, సిద్ధాంతం కోసం ప్రజలు అని భావిస్తుంటాయి.
అందుకే ప్రజలు ఆ సిద్ధాంతానికి దూరమవుతున్నారు. జీవితమంతా భావజాలానికే
ధారపోసిన భోళా శంకరుడు సీపీఐ నారాయణ, ఎయిర్‌పోర్టు దాకా వెళ్లి విద్యార్థి
నేత కన్నయ్యకు స్వాగతం పలికి, చేతులు కట్టుకుని ఒదిగి నిలబడ్డ తీరు చూసి
వామపక్షాల పరిస్థితిపై అనేకమంది జాలిపడ్డారు. అరువు సిద్ధాంతాలు, పడికట్టు
నినాదాలు, పరదేశీ భావజాలాలు వదిలి భారతీయీకరణకు సిద్ధమైతేనే వామపక్షాలకు
మనుగడ! ఎరుపు వెలిస్తే వచ్చేది కాషాయమే కదా!
కృ.తి
kruthi1972@gmail.com
(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో )
No comments:
Post a Comment