08 July, 2013

అచ్చమైన తెలుగుబడి

07/07/2013 - బి.వి.ప్రసాద్ 


ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 7వేల భాషల్లో తెలుగు భాష ఒకటి. విశ్వంలో అత్యధిక శాతం మంది మాట్లాడే పది భాషల్లో భారతీయులు మాట్లాడే హిందీ, ఇంగ్లీషు ఉన్నాయి. అత్యధికంగా మాట్లాడే తొలి 15 భాషల్లో తెలుగు చోటు చేసుకుంది. ఆ తర్వాతనే మిగిలిన భారతీయ భాషలన్నీ ఉన్నాయి. అంటే- దేశ భాషల్లో రెండో స్థానాన్ని తెలుగు ఆక్రమించింది. రాష్ట్ర అధికార భాషగానూ, అనేక రాష్ట్రాల్లో రెండో భాషగానూ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాడుక భాషగానూ తెలుగు వర్థిల్లుతోంది. ప్రపంచంలో మూడు వేల భాషలు మాట్లాడే వారి సంఖ్య కుదించుకు పోతుండటంతోనో లేదా ఆయా మాతృభాషలకు చెందిన వారు ఇతర భాషలకు బదలాయింపు కావడం వల్లనో అవి ‘మృత భాషలు’గా మారుతున్నాయని ‘అట్లాస్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇన్ డేంజర్ అండ్ డిస్సెప్పియరింగ్ ’ నివేదికలో ఐక్యరాజ్యసమితిలోని యునెస్కో పేర్కొంది. 

30 శాతం మంది పాఠశాల విద్యార్థులు తమ మాతృభాషకు దూరమైతే ఆ భాష ప్రమాదంలో పడినట్టే, 40 శాతానికి ఆ సంఖ్య చేరితే తీవ్ర ప్రమాదానికి గురైనట్టే, అదే 60 శాతానికి దాటితే ఆ మాతృభాష అంపశయ్యపై ఉన్నట్టే..! తెలుగు భాష ఒక పక్క భిన్నపదజాలంతో, విభిన్న ప్రాంతీయ యాసలతో వ్యవహరించబడుతున్నా, భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించినా, విశ్వ సాంస్కృతిక వేదికపై గౌరవ పతాకాన్ని ఎగురవేసినా, తెలుగు భాషకు ముప్పు మాత్రం తప్పలేదు. ప్రపంచీకరణ ప్రభావంతో అనేక భాషలు కనుమరుగయినట్టే తెలుగు స్థానే రాష్ట్రంలో ఆంగ్లం అగ్రపీఠాన్ని అధిరోహిస్తోంది. లుప్తమవుతున్న భాషల్లో తెలుగు ముందంజలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాష వాడకానికి, అభివృద్ధికి, భాషా పరిరక్షణకు లెక్కలేనన్ని సంస్థలు ఉన్నాయి. ఎన్నో జీవోలు వచ్చాయి, న్యాయస్థానాల్లో తీర్పులు ఆంగ్లంలోనే వస్తాయి. పాలనా వ్యవస్థకు మూలస్తంభం అయిన సచివాలయంలో వ్యవహారాలన్నీ ఆంగ్లంలోనే నడుస్తాయి. ప్రజల సౌకర్యార్థం కాకుండా పనిచేసే అధికారుల కోసం ఆంగ్లంలోనే రాతకోతలు జరుగుతాయి. పాఠశాలల్లో కూడా గత ఏడాది నుండి పరాయి భాషలో బోధన వేగం పుంజుకుంది. 

గత 25 ఏళ్లుగా ఆంగ్లభాషా బోధన ప్రైవేటు రంగంలో నిరాటంకంగా సాగిపోతున్నా, ప్రభుత్వ రంగంలోనే ఈ ఏడాది నుండి ఇటు రెసిడెన్షియల్ స్కూళ్లలోనూ, అటు గురుకులాల్లోనూ, మరో పక్క మోడల్ స్కూళ్ల పేరిట ఆంగ్లభాషా మాధ్యమంలోనే బోధనకు ప్రభుత్వమే నడుం బిగించింది. రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్‌లో ఏకంగా ప్రభుత్వమే ఆంగ్లమాధ్యమంలో శిక్షణ ప్రారంభించింది. కానె్వంట్లలో తెలుగులో మాట్లాడితే శిక్షలు విధించే పరిస్థితి కూడా వచ్చింది. పిల్లల్లో సృజనాత్మకతను మొగ్గలోనే తుంచేస్తున్నారు. సంస్కృతి వైశిష్ట్యం, సంస్కారౌన్నత్యం, భాషావికాసం మాతృభాష ద్వారానే జరుగుతాయనే విషయాన్ని మరిచిపోతున్నారు. పరభాషలో కంఠస్థం చేసే విధానం ద్వారా విద్యార్థులు మాతృభాషలో మనసారా చెప్పుకోలేని దుస్థితి వచ్చింది. సంప్రదాయ వ్యాకరణాంశాలు, సంప్రదాయాలు పక్క దారి పట్టాయి. తెలుగు మాధ్యమం సరేసరి. తెలుగు బోధనాంశం కూడా మొక్కుబడిగా మారిపోయింది. 

1964-68లో వచ్చిన కొఠారి కమిషన్ నూతన విద్యావిధానంలోనూ విద్యార్థులకు ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో శిక్షణ మాతృభాషలోనే జరగాలని చాలా స్పష్టంగా సూచించింది. కానీ, నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన చరకుడు, ఆర్యభట్ట, వ్యాసుడు, ఆచార్య నాగార్జునుడు, కౌటిల్యుడు, రామానుజం, వాత్సాయనుడు.. అంతెందుకు నోబెల్ బహుమతి గ్రహీత జగదీష్ చంద్రబోస్, గీతాంజలి రాసిన రవీంద్రనాథుడు అంతా మాతృభాషలో కృషి చేసిన వారే. విదేశీయులు సైతం తెలుగు భాషా బోధన గొప్పదనాన్ని గుర్తించి, అందుకు కృషి చేసిన దాఖలాలు లెక్కలేనన్ని ఉన్నాయ. విద్యాబోధన కోసం పాఠశాలల్లో విషయ ప్రణాళిక రూపకల్పన ద్వారా, విద్యార్థుల్లో సాధించాల్సిన ప్రవర్తనా మార్పులు సాధించే విధంగా నేటి బోధనా విధానం రూపొందించారు. తెలుగు భాషా బోధనలో ప్రాథమిక స్థాయిలో భాషా నైపుణ్యాలైన శ్రవణం, భాషణ, పఠనం, లేఖనం నేర్పించడం, భాషపై అవగాహన, పదజాలాభివృద్ధి, భావ గ్రాహణం, భావ వ్యక్తీకరణ సామర్థ్యాలను సాధించడం, సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ సృజనాత్మక శక్తిని పెంపొందించడం చాలా ముఖ్యం. అయితే, నేటి విద్యార్థులలో తెలుగు అభ్యసనంపై విముఖత పెరిగింది. దానికి కారణం తల్లిదండ్రుల నుండి వస్తున్న ఒత్తిడే. తెలుగు భాష వారి నిత్యజీవితంలో ఎక్కడా ఉపయోగపడే విధంగా అభివృద్ధి చెందకపోవడం, తెలుగు పాఠ్యప్రణాళికలో తక్షణ ఉపాధి కల్పించే అంశాలకు చోటు లేకపోవడమేనని ప్రణాళికల నిర్దేశకులు గుర్తించకపోవడం కూడా తెలుగు భాష కుదించుకుపోవడానికి మరో ప్రధాన కారణం. 

ఆశా కిరణం విద్యా భారతి :
ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో మాతృభాషాభివృద్ధికి, విద్యాభివృద్ధికి, ప్రధానంగా బాలికా విద్యకు, చదువు అందని వారికి చదువును అందించే వినూత్న కార్యక్రమాలతో పాటు వేలాది పాఠశాలలను విద్యా భారతి నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 16 వేల పాఠశాలలు, 26 వేల ఏకోపాధ్యాయ పాఠశాలలు, సంస్కార పాఠశాలలను, ఇతర విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. విద్యనందించే అతిపెద్ద గొలుసు స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలో విద్యా భారతి ఒక్కటే. మన దేశంలోనే కాకుండా విద్యాభారతి ఆధ్వర్యంలో నేపాల్‌లోనూ అనేక విద్యా సంస్థలను నిర్వహిస్తున్నారు. అండమాన్, నికోబార్ దీవుల్లో కూడా పాఠశాలలను గిరిజనుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. విద్యాభారతి దేశంలోని వివిధ రాష్ట్రాలలో క్షేత్రాల వారీ పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రంగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా భారతి కార్యకలాపాలు ‘శ్రీ సరస్వతి విద్యా పీఠం’ పేరుతో నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సరస్వతీ విద్యా పీఠం 360 పాఠశాలలను నిర్వహిస్తోంది. 11 ఆవాస పాఠశాలలను, 85 ప్రాథమికోన్నత పాఠశాలలను, 118 ఉన్నత పాఠశాలలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున పాఠశాలలను నిర్వహిస్తున్న మరో సంస్థ లేదంటే అతిశయోక్తి కాదేమో! అదీ తెలుగు మాధ్యమంలో పాఠశాలలను నిర్వహించడంతో పాటు సకలకళలపై విద్యార్థులకు మంచి తర్ఫీదును అందిస్తున్నారు. నిరుపేద విద్యార్థులు, మారుమూల ప్రాంతాలకు చెందిన వారు, గిరిజన విద్యార్థులకు ఈ విలువాత్మకమైన విద్యను అందించడం ద్వారా సమాజంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పేందుకు సరస్వతీ విద్యా పీఠం విశేష కృషి చేస్తోంది. 

సమాజానికి ఆశాకిరణం :
సామాజిక పరివర్తనకు, సమగ్ర వికాసానికి, భారతదేశానికి పూర్వ వైభవాన్ని సాధించేందుకు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, జాతీయ భావాలున్న కార్యకర్తలు నడుం బిగించడంతో శ్రీ సరస్వతీ శిశుమందిరాల ఉద్యమం ప్రారంభం అయింది. తొలి శిశు మందిరం దేశంలో 1952లో ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో ప్రారంభం అయింది. 1979లో అన్ని రాష్ట్రాల్లోని శిశు మందిరాలను సమన్వయం చేసేందుకు అఖిల భారత శిక్షా సంస్థాన్ - విద్యా భారతి ఏర్పాటైంది. మన రాష్ట్రంలో విద్యా భారతికి అనుబంధంగా శ్రీ సరస్వతీ విద్యా పీఠం, భారతీయ విద్యా కేంద్రం పనిచేస్తున్నాయి. సరస్వతీ విద్యా పీఠం హైదరాబాద్ కేంద్రంగానూ, భారతీయ విద్యా కేంద్రం విశాఖపట్టణం కేంద్రంగా పనిచేస్తోంది. హైదరాబాద్‌లో పరిపాలనా కేంద్రం ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలోనూ, విద్యాత్మక కేంద్రం బండ్లగూడ సమీపంలోని శ్రీ శారదాధామంలోనూ పనిచేస్తున్నాయి. 

విలువలే ప్రాణం : 
యువతలో దేశభక్తిని నింపడంతో పాటు శారీరక-మానసిక, ప్రాణిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక వికాసాన్ని సంపూర్ణంగా నింపడం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా శ్రీ సరస్వతీ విద్యా కేంద్రాలు పనిచేస్తున్నాయి. గ్రామాల్లో, అడవుల్లో, కొండల్లో, పూరిళ్లలో నివసిస్తున్న పేదల పిల్లలకు ఆసరా ఇచ్చి సమతా భావనను, సుసంపన్నమైన భారతీయ జీవన విధానాన్ని నిర్మించేందుకు, సమర్థులైన యువతను ఈ దేశానికి అందించేందుకు విద్యా పీఠం అహరహం కృషి చేస్తోంది. సమగ్ర వ్యక్తిత్వంలో భారతీయతను పాదుగొల్పడం, భారతీయ విద్యా విధానాన్ని వికసింపచేసుకునేందుకు అనేక ప్రణాళికలను నిర్వహిస్తోంది. సమర్థ, సమగ్ర యువతరం విద్యార్థులందరూ సమగ్రమైన, సంపూర్ణమైన, సమర్ధమైన యువతరంగా తయారైతే అన్ని సమస్యలూ పటాపంచలు అయిపోతాయి. దేశభక్తి పెనవేసుకుని వారి ఆలోచన, ఆచరణ అనుక్షణం దేశపు అణువణువుతో తాదాత్మ్యం చెందేదిలా వారిని రూపుదిద్దే బృహత్కార్యాన్ని విద్యాపీఠం భుజాన వేసుకుంది. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా దేశ గౌరవాభిమానాలే ప్రధానంగా, దేశ సాంస్కృతిక వారసత్వం పట్ల , దేశ ప్రాచీన రుషి పరంపర పట్ల భక్తి , గర్వంతో పాటు చరిత్ర పట్ల అవగాహన, వర్తమానంపై బాధ్యత, భవిష్యత్‌ను ఉజ్వలం చేయాలనే ఆకాంక్ష, స్వప్నాన్ని సాకారం చేయగల ప్రగాఢ సంకల్పం ఉన్న యువతను రూపుదిద్దే మహత్కార్యం విద్యాపీఠంలో నిరంతరం జరుగుతోంది. 

పంచకోశ వికాసం :
మనిషిలో పంచకోశాలు ఉంటాయి. మనిషి అంటే కేవలం రక్తమాంసాల రూపమే కాదు. శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ తదితర సూక్ష్మాంశాల సమష్టి సమాహారమే మనిషి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞాన మయ, ఆనందమయ అనే పేర్లున్న ఐదు కోశాలు వికసించి విశేష సామర్థ్యాలు ఉంటేనే ఆ వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్టు శిశువులో శివస్వరూపం దాగి ఉంటుంది. ఆ ఐదు కోశాల వికాసానికి అవసరమైన ప్రక్రియల ద్వారా వాటిని ఉత్తేజపరిచి విశిష్ట వ్యక్తుల నిర్మాణం చేయవచ్చు. దానికి అనుగుణంగానే శిశు మందిరాల్లో అన్నమయకోశ వికాసానికి మంచి ఆహారపానీయాలు, శారీరక వ్యాయామం అందిస్తున్నారు. యోగాశిక్షణ ద్వారా ప్రాణమయ వికాసం కోసం దేహ ప్రాణుల మధ్య సంతులనం సాధించే కృషి జరుగుతోంది. శ్వాస ప్రశ్వాసలపై నియంత్రణ సాధించే దిశలో సంగీత శిక్షణ ద్వారా, వివిధ కళల అభ్యసనం ద్వారా శిశువుల మనోమయ వికాసం జరుగుతోంది. బాల బాలికలను విశాల మనస్కులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. సంస్కృతంపైనా పట్టు భారతీయ భాషలతో పాటు సమస్త భాషలకూ మాతృకగా భావించే సంస్కృత భాషలో అపారజ్ఞాన భాండాగారాన్ని బాలబాలికలు గుర్తించేందుకు, సంస్కృతంలోని విశ్వవిజ్ఞానాన్ని అందించేందుకు ఆ భాషా బోధన జరుగుతోంది. నైతిక శిక్షణ ద్వారా యోగా, సంగీతం, సంస్కృతం నేర్పించడంతో ఆనందమయ వికాసానికి తోడ్పాటు అందిస్తున్నారు. ఆత్మవికాసం పొందిన శిశువులు ప్రకృతితో, తోటి వారితో, సహచర జీవులతో, విశాల విశ్వంతో, పరమేశ్వరుడితో తాదాత్మ్యం చెంది పరవశించే మార్గంలో పయనించేందుకు ప్రేరణ కల్పిస్తారు. అలా ఒకే మారు శరీరం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ అనే ఐదు అంశాలను శారీరక, యోగా, సంగీతం, సంస్కృతం, నైతిక శిక్షణ అనే ఐదు ఆధారభూతాలతో వికసింపచేసుకున్న సమగ్ర వ్యక్తిత్వం ఉన్న యువతరం నిర్మాణానికి శిశుమందిరాల్లో శైశవ దశ నుండే కృషి జరుగుతోంది. 

జాతి జీవనంలో కర్తవ్యం :
సమర్థవంతమైన యువతీ యువకులు నేటి సవాళ్లకు తేలికైన పరిష్కారాలను అందించగలుగుతున్నారు. నిరుపేదలను ఆదుకోవడం, అందుకు నడుం బిగించడం, దురాచారాలను, అన్యాయాలను తొలగించి సామరస్య పూర్వకమైన, సుసంపన్నమైన జాతీయ జీవనాన్ని నిర్మించడానికి సరస్వతీ విద్యా పీఠంలో శిక్షణ- ఓ వేదికగా, ఆలంబనగా, అతిశ్రేష్టమైనదిగా రుజువైంది. అనేక మంది శిశుమందిర విద్యార్థులు జాతీయ జీవన రంగాల్లో కర్తవ్య నిర్వహణ చేస్తూ జాతికి ఆశాదీపాలుగా ఉన్నారు. న్యాయమూర్తులుగా, ఐఎఎస్,ఐపిఎస్, గ్రూప్ 1 అధికారులుగా, ఐటి రంగంలోని వివిధ సంస్థల అధిపతులుగా, సామాజిక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి పాఠశాలలను అందుబాటులో ఉంచడమేగాక, అనేక కారణాలతో పాఠశాలలకు దూరంగా ఉన్న వారిని గుర్తించి కనీసం వారు రెండున్నర గంటల పాటు విద్యను నేర్చుకునేందుకు వీలుగా ఏకోపాధ్యాయ పాఠశాలలను కూడా ఏర్పాటుచేశారు. 

ఇంతటి బృహత్కార్యాన్ని సమర్థంగా నిర్వహించేందుకు శ్రీ సరస్వతీ విద్యా పీఠం పరిశోధన- అభివృద్ధి విభాగాన్ని కూడా నిర్వహిస్తోంది. అనేక పరిశోధనలను నిర్వహించి వాటి ఫలితాలను ప్రచురించి సమాజం ముందు ఉంచుతోంది. సమాజంలోని అనేక మంది మేధావులు, విద్యావేత్తలను సమావేశపరిచి చర్చలు నిర్వహించి పుస్తకాలను రాయించి సమాజానికి నవ నిర్మాణ నాయకత్వ స్థాయిలో నిలిచేలా సరస్వతీ విద్యా పీఠం కృషి చేస్తోంది. పుస్తకాల మోతతో, ఇంటిపనుల భారంతో చిన్నారులు కుంగిపోకుండా తరగతి గది వాతావరణాన్ని భిన్నంగా ఆటపాటల ద్వారా ఎపుడూ ఉత్సాహం పెల్లుబికేలా శిశువాటికా విధానాన్ని అవలంబిస్తోంది. గ్రామీణ వికాసానికి దోహదం అయ్యేలా గ్రామీణ శిశువాటికలను ఏర్పరచి పిల్లల కుటుంబ సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి విలువలు, విద్య గురించి వారికి అర్థమయ్యేలా ప్రయత్నిస్తోంది. 

మరో పక్క బాలికా విద్యకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. భారతీయ సంస్కృతి పట్ల అవగాహనకు సంస్కృతీ బోధన పరియోజన విభాగం ద్వారా ఇతర పాఠశాలల్లోని విద్యార్థులకు కూడా సంస్కృత భాషను నేర్పించడం, వారి స్థాయిత్వాన్ని అంచనా వేసి ధ్రువపత్రాలను జారీ చేస్తోంది. వనవాసులకు, గిరిజనులకు వారి సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకోగలిగే విధంగా ప్రత్యేక విధానాలకు వనవాసీ విద్యా విభాగం ద్వారా పాఠశాలలు నిర్వహిస్తోంది. నిబద్ధత, నిజాయితీ, నిరంతర పరిశ్రమాభిలాష ఉన్న వారిని ఆచార్యులుగా తీర్చిదిద్దేందుకు శారదాధామంలో ఆచార్య ప్రశిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిపుణులతో ఈ శిక్షణ కొనసాగుతుంది. 

శిశుమందిరాల్లో ప్రతి రోజూ శారీరక వికాసం కోసం సూర్యనమస్కారాలు, యోగ, వ్యాయామం, కరాటే (యుద్ధ) నైపుణ్యం, ఆటలలో కూడా శిక్షణ అందిస్తారు. విద్యా భారతి అఖిల భారత స్థాయిలో నిర్వహించిన ఖైల్‌ఖూద్ పోటీల్లో , పాఠశాల స్థాయి క్రీడా సమాఖ్య నిర్వహించే పోటీల్లో అనేక మంది శిశుమందిర విద్యార్థులు పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. మరో పక్క శాస్ర్తియ దృక్పథం పెంపొందించేందుకు పాఠశాల స్థాయి నుండి అఖిల భారత స్థాయి వరకూ ప్రతి సంవత్సరం విజ్ఞాన మేళా నిర్వహిస్తున్నారు. సంపూర్ణ సమగ్ర వికాసానికి దోహదం చేసే రీతిలో ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పూర్తిగా వినియోగించుకుంటూ వ్యక్తుల పరిపూర్ణత్వానికి శిశు మందిరాలు పునాది వేస్తున్నాయి. సమాజ వికాసమే ధ్యేయంగా, దేశం పట్ల నిష్ట ఉన్న వ్యక్తులను తయారుచేయడమే లక్ష్యంగా , జాతి పునర్నిర్మాణమే ఆశయంగా సరస్వతీ విద్యా పీఠం పనిచేస్తోంది. భారత మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలాం వంటి మహామహులు ఈ సంస్థలను సందర్శించి, ఆశ్చర్యచకితులై శిశు మందిరాల అవసరాన్ని నొక్కి చెప్పారు. విద్యా రంగంలో ఎనలేని కృషి చేస్తూ భారతీయతను ప్రాణప్రతిష్ట చేసి పునరుజ్జీవింప చేసేందుకు నిరంతరం ప్రయత్నం జరుగుతోంది.

ప్రశాసన విధానం :
విద్యాపీఠం నాలుగు అంచెలుగా పనిచేస్తుంది. సంస్థ నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో ఆచార్యులకు కూడా అన్ని స్థాయిల్లో అవకాశం కల్పిస్తారు. పాలక మండలి , ప్రాంత సంచాలన సమితి, సంభాగ్ కార్యకారిణి, ప్రబంధ కారణి, శైక్షణిక మార్గదర్శక మండలి ఉంటాయి. పాలక మండలిలో 15 మంది సభ్యులు ఉంటారు. ఇది సంస్థలో అత్యున్నత సాయ సంఘం. విద్యాపీఠానికి సంబంధించి అన్ని విషయాల్లో నియంత్రణ బాధ్యత ఈ సంఘానికే ఉంటుంది. ప్రాంత సంచాలన సమితి కూడా రాష్ట్ర స్థాయి సంఘమే, విద్యాపీఠం అన్ని వ్యవహారాలను నిర్వహించడమే దీని బాధ్యత. దీనిలో 45 మంది సభ్యులు ఉంటారు. ఈ సమితిలో పాలక మండలి నుండి ఏడుగురు, సంభాగ్ కార్యదర్శులు, ఆచార్య ప్రతినిధులు ఐదుగురు ఉంటారు. పరిపాలనా సౌకర్యార్థం రాష్ట్రాన్ని 11 సంభాగ్‌లుగా విభజించారు. సంబంధిత పరిధిలోని స్కూళ్ల పాలన, పర్యవేక్షణ, శిక్షణ తదితర అంశాలను ఈ కమిటీ చూస్తుంది. పాఠశాల స్థాయిలో ప్రబంధకారణి ఉంటుంది. విద్యా విషయాల్లో మార్గదర్శనం చేసేందుకు ప్రాంత, సంభాగ్, పాఠశాల స్థాయిల్లో ఏర్పాటుచేసిన మూడు అంచెల ప్రత్యేక సమితి శైక్షణిక మార్గదర్శక మండలి ఉంటుంది. ఈ సంస్థలు అన్నీ స్కూళ్ల వ్యవహారాలతో పాటు సంస్కార సాధన వర్గ, ఆచార్య ప్రశిక్షణ వర్గ, నైపుణ్య వర్గను పర్యవేక్షిస్తాయి. 

నిధుల కొరత :
తెలుగు మాధ్యమంలో చదువుతున్న విద్యార్ధుల సంఖ్య తగ్గడంతో పాటు నిర్వహణ భారం విపరీతంగా పెరగడం సరస్వతీ విద్యాపీఠానికి తలకు మించిన భారంగా రోజురోజుకూ పరిణమిస్తోంది. కొన్ని పాఠశాలలు ఎలాంటి ఇబ్బందీ లేకుండా నడుస్తున్నా మరికొన్ని పాఠశాలలు తీవ్రమైన నష్టాల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వీటిని ఆదుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఉదారంగా నిబంధనలు సడలించి ఆర్థిక సాయం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పరిరక్షించుకోవల్సిన అవసరం ఈ సమాజంపై ఉంది. పాఠ్యేతర కార్యక్రమాలు శారీరక కార్యక్రమాలు నైతిక, ఆధ్యాత్మిక శిక్షణ కళాత్మక శిక్షణ రంగస్థల కార్యక్రమాలు ఘోష్ యోగా, సంస్కృతం ఖేల్ ఖూద్ విజ్ఞాన మేళా.

నిర్వాహక ప్రముఖులు :
విద్యాపీఠం అధ్యక్షుడు - సిహెచ్ ఉమామహేశ్వరరావు 
దక్షిణ మధ్య క్షేత్ర నిర్వాహక కార్యదర్శి - లింగం సుధాకర్‌రెడ్డి 
ప్రాంత శైక్షణిక ప్రముఖ్ - రావుల సూర్యనారాయణ 

కార్యాలయం :
శ్రీ సరస్వతీ విద్యాపీఠం, 
ఇంటి నెంబర్ 6-3-597/ఎ/7, 
వెంకటరమణ నగర్, 
ఖైరతాబాద్, హైదరాబాద్-500 004 
ఫోన్: 23316160

Courtesy : Andhra Bhoomi (Telugu Daily)

No comments:

Post a Comment