28 June, 2016

నల్లధనం మూలాలపై వేటు!


దేశవ్యాప్తంగా మేటవేసిన నల్లధన పరిమాణం ఎకాయెకి రూ.30లక్షల కోట్లు! స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 20శాతంగా ఉన్న ఈ మొత్తం- థాయ్‌లాండ్‌, అర్జెంటీనా ఆర్థిక వ్యవస్థల పరిమాణంకన్నా అధికంగా ఉందన్న వాస్తవం ఆలోచనాపరుల్ని కలచివేయక మానదు. అవినీతి- అక్రమార్జనకు తల్లివేరు. అక్రమార్జన నల్లధనానికి మరో పేరు! పలు సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డును అనుసంధానం చెయ్యడం ద్వారా అక్రమార్కుల మూతులకు చిక్కాలు బిగించి ఏటా రూ.36వేలకోట్లు ఆదా చెయ్యగలుగుతున్నామని ప్రధాని మోదీ చెబుతున్నారు. ‘ఇప్పటివరకు పైపైన మాత్రమే శుభ్రం చెయ్యగలిగాం... సమూల క్షాళన జరగాల్సి ఉంది’ అని స్పష్టీకరించిన కేంద్రసర్కారు- నల్లధనం వివరాల వెల్లడికి నాలుగు నెలల గడువు ఇవ్వడాన్ని స్వాగతించాలి. నూట పాతిక కోట్ల పైబడిన జనావళిలో ఏటా రూ.50లక్షల పైచిలుకు ఆదాయం చూపిస్తున్నవారు కేవలం లక్షన్నర మందే ఉండటం విడ్డూరమన్న ప్రధాని- నిర్దిష్ట గడువులోగా అప్రకటిత ఆదాయం, ఆస్తుల వివరాలు స్వచ్ఛందంగా వెల్లడిస్తే ఎలాంటి ప్రశ్నలు అడగబోరని, ఎలాంటి దర్యాప్తులూ ఉండబోవని భరోసా ఇస్తున్నారు. 45శాతం పన్నుగా చెల్లించి పూర్తి దిలాసాతో ఉండే సువర్ణావకాశంగా ప్రధాని మోదీ ఈ చొరవను అభివర్ణిస్తున్నా, గతానుభవాల వెలుగులో నల్లధనం గుట్టుమట్లు పూర్తిస్థాయిలో బయటకొస్తాయా అన్న సందేహం కలగక మానదు. అక్రమార్జన ప్రవాహాలకు లాకులెత్తుతున్న అవినీతి మూలాల కుంభస్థలిని కుమ్మికూలగొట్టనంతకాలం- నరికిన కొద్దీ మొలుచుకొచ్చే రావణాసురుడి తలల్లా నల్లధనం గుట్టలు రాక మానవు. యూపీఏ ప్రభుత్వం 2012లో నల్లధనంపై వెలువరించిన శ్వేతపత్రం- స్థిరాస్తి, బులియన్‌ ఆభరణాల విపణి, ప్రభుత్వాల పరంగా కొనుగోళ్ళు, విదేశీ వాణిజ్యం వంటి పలు రంగాల్లో నల్లధనం ‘ఉత్పత్తి’కి ఎలాంటి అవకాశాలున్నాయో విపులీకరించింది. అనునిత్యం పౌరసేవలకు పూచీపడే పలు ప్రభుత్వ విభాగాలూ అవినీతి కార్ఖానాలై వర్ధిల్లుతున్న వాస్తవాన్ని గుర్తించి వాటి క్షాళనకూ సత్వరం సమకట్టడం మోదీ ప్రభుత్వ మౌలిక విధి!
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలూ ఏటా జరిపే వస్తుసేవల కొనుగోళ్ల పరిమాణం 10-11 లక్షల కోట్ల రూపాయలు. అందులో అధమపక్షం పదిశాతం లంచాలమేతకు పోతోందనుకొంటే, ఎంత మొత్తం నల్లధనంగా రూపాంతరం చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. పారదర్శకత, జవాబుదారీతనాలంటూ పౌరసేవల ఉద్యోగులకు ప్రభుత్వాలు ఎంత బాధ్యత మప్పినా, అవినీతి పరిశ్రమ చక్రాలు ఆగితే ఒట్టు! తూర్పు గోదావరి జిల్లాలో రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ అక్రమార్జన రూ.800 కోట్లు అంటే- గుండెలు అవిసిపోతాయి. కర్మాగారాల విభాగంలో బాయిలర్ల డైరెక్టర్‌గా వ్యవహరించిన వ్యక్తి వెనకేసింది రూ.12 కోట్లు! మున్సిపల్‌, టౌన్‌ప్లానింగ్‌, విద్యుత్‌, పోలీస్‌... ఇలా నేరుగా ప్రజలతో సంబంధం ఉండే విభాగాల గురించి చెప్పనక్కర్లేదు. మన ప్రజల పట్ల విశ్వాసం ఉంచాలంటూ పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లోనే ప్రధాని మోదీ- విద్యార్థుల ‘స్వయం ధ్రువీకరణ’కు బాటలు పరచారు. అదే పంథాలో, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా గృహనిర్మాణ మార్గదర్శకాల్ని సిద్ధం చేసి- సర్కారీ శాఖల అనుమతులతో నిమిత్తం లేకుండా వాటికి అనుగుణంగా ప్రజలే ఇళ్లు కట్టుకొనే పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేమా? అంతా నిబంధనలకు అనుగుణంగానే నిర్మించామని గృహస్తులే స్వయం ధ్రువీకరణ ఇస్తే సరిపోయేలా జవాబుదారీతనాన్ని పెంచలేమా? తప్పుడు ధ్రువీకరణలకు శాస్తి తప్పదన్న బెదురు ఉండేలా చట్టాల్ని కట్టుదిట్టం చెయ్యడం, నేరగాళ్ల వెన్నుకాచే విచక్షణాధికారాలు ఎవ్వరికీ లేకుండా చూడటం వంటి సంస్కరణలతో సర్కారీ శాఖల వేధింపుల నుంచి ప్రజాజీవనం ఎంతగానో తెరిపిన పడుతుంది. చేతులు తడపనిదే దరఖాస్తులు కదలని అవినీతి తోక ముడుస్తుంది!
 
భారత్‌ లాంటి వర్ధమాన దేశానికి అవినీతి అక్షరాలా గుదిబండ. పేదలకు ఉద్దేశించిన రాయితీల ఖాతాలో ఎకాయెకి లక్షా 80వేలకోట్ల రూపాయల దాకా అనర్హుల పాలబడటం కంటే- ఆర్థిక ఉగ్రవాదం ఉందా? రెవిన్యూ, పంచాయతీరాజ్‌ సహా ఏయే శాఖల్లో అవినీతి పుంజాలు తెంచుకొందో అనిశా(ఏసీబీ) నివేదికలే ఎలుగెత్తుతున్న వేళ, దాన్ని విస్మరించి నల్లధనం వెల్లడికి చేసే ప్రయత్నం అంతా గత జలసేతు బంధనమే కదా? అన్ని స్థాయుల్లో అవినీతికి లాకులెత్తడంలో రాజకీయ విచక్షణాధికారం పెద్దపాత్రే పోషించింది. మంత్రి విచక్షణాధికారం అంటే, అతగాడి సొంత ఇష్టాయిష్టాలు కానేకాదంటూ దానికీ విశాల ప్రజాహితమే ప్రాతిపదిక కావాలని సతీశ్‌ శర్మ కేసులో సుప్రీంకోర్టు లక్ష్మణరేఖలు గీసింది. మంత్రులకు మార్గదర్శకాల ద్వారా యూపీఏ తరహా దొంగల దోపిడిని నియంత్రించిన మోదీ ప్రభుత్వం- దేశీయంగా పన్నుల వ్యవస్థను సాకల్యంగా ప్రక్షాళించాలి. కీకారణ్యాన్ని తలపిస్తున్న పన్నుల వ్యవస్థ చెల్లించేవాడిని చెండుకు తినేలా ఉండటంతోపాటు, ఎగవేతదారులతో అవినీతి అధికారగణం భాగస్వామ్యానికీ పాదు చేస్తోంది. జవాబుదారీతనం కొరవడిన ఏకవ్యక్తి పెత్తనానికి విచక్షణాధికారం జత కలిసినందువల్లే అవినీతి పుట్టుకొస్తోందని ఆదాయపన్ను శాఖే ఇటీవల స్పష్టీకరించింది. అలాంటి వ్యవస్థాగత జాడ్యాల్ని సమూలచ్ఛేదం చేసి, పన్నురేట్లను సహేతుక స్థాయికి చేర్చి, ఎలాంటి బాదరబందీ లేకుండా ఎవరికివారు సుంకాలు చెల్లించగలిగే సానుకూల వాతావరణ పరికల్పన నేటి అవసరం. అవినీతి ‘వాటా’వరణాన్ని చెల్లాచెదురు చెయ్యడానికి అదే రాజమార్గం!

ఈనాడు సౌజన్యం తో  

No comments:

Post a Comment