("సంఘ్ సంస్కరణలు" పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన సంపాదకీయం)జన్యు మార్పిడి వంగడాలు, పోలవరం సమస్యలపై రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తీసుకున్న చొరవ ఆహ్వానించదగినది
పరిశోధనల ఫలాలు రైతన్నకు చేరినప్పుడే వ్యవసాయం బలపడుతుందంటూ ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్’ (ఐసీఏఆర్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘లాబ్ టు ల్యాండ్’ నినాదం ఇచ్చిన రోజే, రాషీ్ట్రయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ సంస్థలు రెండు మోదీ ప్రభుత్వం తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయాన్ని నిలిపివేయడం గమనించవలసిన పరిణామం. కొద్దిరోజుల క్రితమే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జీఈఏసీ) వరి, వంకాయ, ఆవ తదితర ఆహార పంటల్లో జన్యు మార్పిడి పరిశోధనలకు అనుమతినిచ్చింది. దీనిని రద్దుచేయాలంటూ పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలుసుకున్న స్వదేశీ జాగరణ్ మంచ్, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు ప్రభుత్వం దానిని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదే సందర్భంలో చెప్పుకోవలసిన మరొక అంశం పోలవరం ప్రాజెక్టుపై దృష్టి సారించాలని ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయించుకోవడం. ఈ ప్రాజెక్టు స్థాయి, ముంపు తీవ్రత, ముఖ్యంగా ఆదివాసులకు జరిగే అన్యాయం ఇత్యాది అంశాలను అధ్యయనం చేయమంటూ నాగపూర్‌లోని కేంద్ర కమిటీ వనవాసీ కళ్యాణ పరిషత్, రాషీ్ట్రయ సేవా భారతి, విశ్వహిందూ పరిషత్‌లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మూడు సంస్థల ప్రతినిధి బృందాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని సుమారు 300 గ్రామాల్లో వేర్వేరుగా అధ్యయనాలు చేస్తాయి. ప్రాజెక్టు డిజైన్ మార్పు కూడా అధ్యయనంలో భాగం కావడంతో రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఒకటి పర్యటనకు సిద్ధమవుతోంది. నెలలోగా కేంద్ర కమిటీకి సమగ్ర నివేదిక అందుతుందనీ, దాని ఆధారంగా పోలవరంపై సంఘ్ తన కార్యాచరణను నిర్దేశించుకుంటుందని అంటున్నారు.
ఈ రెండు పరిణామాలను చూసినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ఈ సారి కీలకమైన అంశాలపై క్రియాశీలకంగా ఉండాలనీ, ప్రభుత్వంపై పట్టుబిగించాలనీ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ చురుకుగా వ్యవహరించింది లేదు. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వంటి కీలకమైన ఆర్థికాంశాల్లో పీవీ బాటలో అటల్ అడుగులు వడిగా వేసినప్పుడు సంఘ్ అభ్యంతర పెట్టింది తక్కువ. దేశ ప్రయోజనాలంటూనే అంతర్జాతీయ ఆర్థిక విధానాలను అలాగే కొనసాగనివ్వడం సంఘ్ అనుసరించిన వైఖరి. స్వదేశీ జాగరణ్ మంచ్ స్వదేశీ నినాదం కూడా అడపాదడపా వినిపించి క్రమేపీ కనుమరుగైపోయింది. అయితే, గతానికి భిన్నంగా, ఇప్పుడు మోదీ అధికారంలోకి రావడంలో సంఘ్ తెరవెనుక చురుకైన పాత్ర పోషించింది. సాంకేతిక పరిజ్ఞానాన్నీ, సోషల్ మీడియానీ వినియోగించి ఆయనకు అధికారం అందుకోవడంలో సహకరించింది. ఒకనాడు అగ్రవర్ణ పార్టీగా పేరుపడ్డ బీజేపీ ఓబీసీలకు విస్తరించింది. ఒక బీసీని ప్రధాని చేసింది. పట్టణ ప్రాంతాల్లోనూ, అందులోనూ మధ్య తరగతి తప్ప ఓటర్లు లేనిపార్టీ ఇప్పుడు పల్లెలకూ, పేదలకూ చేరింది. ఒంటరిగా అధికారంలోకి వచ్చింది.
ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ |
‘మేం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తూ వుంటాం. ప్రజలతో మాట్లాడతాం. పరిస్థితులను ప్రత్యక్షంగా చూస్తాం. క్షేత్రస్థాయి సమస్యలేమిటో మాకు తెలుస్తాయి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో మోదీ ప్రభుత్వానికి తెలియచేయడం వరకే మా పని. తగినట్టుగా విధాన నిర్ణయాలు చేయడం ప్రజాప్రతినిధుల పని’ అంటూ గత ఏడాది నవంబరులోనే మేధావులు, పారిశ్రామికవేత్తల సమక్షంలో స్పష్టం చేశారు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్. తెరవెనుకనుంచి ప్రభుత్వాన్ని నడిపించే ఉద్దేశం లేదన్న ఆయన మాటలని పూర్తిగా విశ్వసించకపోయినప్పటికీ, ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వానికి చేరేవేసే భూమిక విషయంలో అభ్యంతర పెట్టవలసిందేమీ లేదు.
సంఘ్ అనుబంధ సంస్థలు అనేకం ప్రజాజీవితంలో పనిచేస్తున్నాయి. ముఖ్యంగా వనవాసీ కళ్యాణ పరిషత్ ఆదివాసుల సంక్షేమానికి కట్టుబడి వారి మధ్య విస్తరించింది. ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో బలంగా ఉన్న ఈ సంస్థ ఆదివాసుల ప్రయోజనం కోసం పోలవరం విషయంలో చొరవ తీసుకోవడాన్ని తప్పుపట్టలేం. అదేవిధంగా, జీవవైవిధ్యానికి పుట్టినిల్లయిన భారతదేశంలో, జన్యుమార్పిడి వంగడాలు తప్ప గత్యంతరం లేదన్న విషపూరితమైన ప్రచారంతో దేశ వ్యవసాయాన్ని కబ్జా చేసే బహుళజాతి కార్పొరేట్ సంస్థల ప్రయత్నాన్ని తాత్కాలికంగానైనా ఆపగలిగినందుకు అభినందించక తప్పదు. ఈ దేశంలోని సన్నకారు రైతు సంక్షేమం కోసం, సగటు మనిషి ప్రయోజనం కోసం కృషి చేస్తున్నంత కాలం, మతపరమైన ఉద్వేగాలను ఆధారం చేసుకోనంత వరకు రాషీ్ట్రయ స్వయం సేవక్ సంఘ్ చొరవను ఆహ్వానించవలసిందే.
Courtesy : Andhra Jyothy Telugu Daily
Courtesy : Andhra Jyothy Telugu Daily
No comments:
Post a Comment