ఆడపిల్ల పుట్టిందని కొందరు చెత్తకుండీలో పడేస్తున్నారు. అంగవైకల్యంతో జన్మించిన పసికందులను రైల్వే ట్రాక్‌లు, రోడ్ల పక్కన పడేసి వదిలించుకుంటున్నారు. ఇలా ఎంతో మంది ఆడపిల్లలుగా పుట్టిన పాపానికి అనాధలు కాక తప్పడంలేదు.
తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఇలాంటి పిల్లలను శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని జనహిత వాత్సల్య సేవాసంస్థ అమ్మగా నిలుస్తోంది. వారికి ఓనమాల నుంచి ఉన్నత చదువులు చదివించి.. పునర్జన్మను ప్రసాదిస్తోంది. అనాధ పిల్లలకు అమ్మగా నిలిచిన వాత్సల్య సేవాసంస్థ గురించే ఈ కథనం...
అప్పుడే తల్లి గర్భం నుంచి పుట్టి కళ్లు కూడా తెరవని మూడు రోజుల పసికందును ఎవరో ఆసుపత్రి బయట అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయారు. ఆకలితో గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికూనను ఆసుపత్రి సిబ్బంది చూశారు. చిన్నారిని దగ్గరకు వెళ్లి పరిశీలించగా పుట్టుకతోనే చేతి, కాళ్ల వేళ్లు అతుక్కుని ఉన్నాయి. ఒక కన్ను లేదు. మరొక కన్ను సగం మాత్రమే కనిపిస్తోంది. అయితే పుట్టిన బిడ్డ అంగవైకల్యమని ఆ తల్లిదండ్రులు వదిలేసి వెళ్లారని ఆసుపత్రి సిబ్బంది ఓ నిర్ధారణకు వచ్చింది. ఈ విషయాన్ని వాత్సల్య సేవా సంస్థకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆ బిడ్డను తీసుకెళ్లారు. ఆ చిన్నారికి సావిత్రి అని పేరు పెట్టారు. గత ఎనిమిదేళ్ల నుంచి ఆలనాపాలనా ఆ సంస్థనే చూస్తోందిప్పుడు. అంతే కాదు త్వరలో సావిత్రి చేతులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా సుమారు 110 మంది పిల్లలకు వాత్సల్య సేవాసంస్థ ఆశ్రయం ఇస్తోంది.
అనాధలకు ఆశ్రయం ఇచ్చేందుకు 1989లో నెల్లూరులోని కొండాయపాళెం రోడ్డు దగ్గర వాత్సల్య సేవా సంస్థకు వేదాంతం సంఘమేశ్వరశాసి్త్ర పునాది వేశారు. నెమ్మదిగా ఎకరా స్థలంలో వసతి, పాఠశాల భవనాలతో పాటు వృద్దాశ్రమం కూడా ఏర్పాటు చేశారాయన.
అన్నీ తామై..
అమ్మా, నాన్నకు దూరమై అనాధలైన చిన్నారులకు చక్కటి జీవితాన్ని అందించగల శక్తి ఒక విద్యకే ఉంది. అందుకే వారికి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు వాత్సల్య ప్రాంగణంలోనే విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఈ బడిలో చుట్టుపక్కల గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులకు తక్కువ ఫీజులు చెల్లించి చదువుకునే అవకాశం కల్పించారు. చదువుతో పాటు కంప్యూటర్ విద్య, ఆటపాటలు, కుట్లు, అల్లికలు, విష్ణు సహస్రనామ పారాయణం, యోగా, ధ్యానం లాంటి అంశాలలోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. వాత్సల్యలో చదువుకున్న విద్యార్థుల్లో ఎందరో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్నతస్థానాలకు వెళ్లడం విశేషం. తల్లిదండ్రులు ఒక ప్రమాదంలో మరణించడంతో 9వ తరగతిలో ఉన్నప్పుడు తమ్ముడిని తీసుకుని కార్తీక్ అనే ఓ బాలుడు వాత్సల్యకు వచ్చాడు. పై చుదువులు చదివించి ఇప్పుడు అహ్మదాబాద్‌లోని ఐసిఎస్ గ్రూపులో డేటాసెంటర్ ఆపరేషన్ మేనేజర్‌గా పని చేస్తూ ఏడాదికి రూ.6లక్షలు సంపాదిస్తున్నాడతను. తమ్ముడు ప్రస్తుతం వాత్సల్యలో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
దాతల ఔదార్యమే కొండంత అండ....
దాతల సహాయంతోనే జనహిత వాత్సల్య సేవాసంస్థ ముందుకు వెళుతుంది. మనం చేసేది మంచి పనైతే దానికి నలుగురు తోడవుతారంటారు. అలాగే వాత్సల్య సేవలు కూడా ఎందరికో స్పూర్తినిచ్చాయి. తమ వంతు సహాయం చేస్తామంటూ దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి నెల సంస్థకు, నిర్వహణకు రూ.6 నుంచి రూ.8లక్షల వరకు ఖర్చవుతోంది. అందులో ప్రతీ పైసా దాతల నుంచే వచ్చినవే! హైదరాబాద్‌కు చెందిన ఎంసికెఎస్ ఫౌండేషన్ ఫర్ ఫుడ్ ఫర్ హ్యాండ్లీ సంస్థ ఏడాదిలో 11 నెలలు రూ.40వేల వరకు అందిస్తుంది. పాఠశాలకు రూ.5.5లక్షల విలువ చేసే వ్యానును అందజేసింది. చెన్నూరు వెంకటేశ్వరరెడ్డి అనే వ్యాపారి ఏటా రూ.3లక్షలు విరాళంగా అందజేస్తారు. ఇలా ఎంతో మంది మనసున్న మానవమూర్తులు ముందుకు వచ్చి ఆ అనాధ పిల్లలకు మేమున్నామంటూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గత రెండేళ్ల కిందట ఎంపీ నిధుల నుంచి వృత్తి విద్య శిక్షణ కేంద్రానికి రూ.10 లక్షలు కేటాయించారు. అనాధ పిల్లలే కాదు, సంస్థలో 30 మందికి పైగానే అనాధ వృద్ధులు ఉన్నారు. వాత్సల్య సేవాసంస్థ విద్యాసంస్థలన్నింటిని సాంబశివరావు చూస్తున్నారు. పిల్లలను ఆణిముత్యాలుగా తయారు చేయడమే ఆయన లక్ష్యం.
శాస్త్రి స్ఫూర్తితోనే నడుపుతున్నాం..
వాత్సల్య సేవాసంస్థ సేవలు ఆ సంస్థ వ్యవస్థాపకులు వేదాంత సంఘమేశ్వరశాసి్త్రకి దక్కాలి. గుంటూరు జిల్లా తెనాలి మండలం కంచవరం అగ్రహారంలో జన్మించిన శాస్త్రి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా పని చేసేవారు. ఒకసారి ఆయన నెల్లూరుకు వచ్చినప్పుడు రైల్వేస్టేషన్‌లో ఉన్న అనాధ పిల్లలను చూసి చలించిపోయారు. స్పందించి ఊరుకోలేదు. వాత్సల్య సేవాసంస్థను నిర్మించారు. కొన్నాళ్ల కిందటే ఆయన కాలధర్మం చేశారు. శాస్త్రి స్ఫూర్తితోనే ఇంతమంది పిల్లలను తీర్చిదిద్దగలుగుతున్నాం.
- సామంతుల గోపాల్‌రెడ్డి, వాత్సల్య సేవాసంస్థ
Courtesy : Andhra Jyothy
No comments:
Post a Comment