05 October, 2016

హద్దు మీరిన పాక్‌కు పాఠం!

శాంతి మంత్రం బలహీనత కాదు...

భారతదేశం చాలా సంవత్సరాలుగా పాకిస్థాన్‌ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సహిస్తూ వచ్చింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలను పాకిస్థాన్‌ ఎగదోస్తోంది. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌లో శిక్షణ శిబిరాలు నిర్వహించడం ఒక ఎత్తు. ఇతర దేశాల్లో విధ్వంసం సృష్టించి వచ్చిన ఉగ్రవాదులకు పాక్‌ ఆశ్రయం కల్పించడం మరో ఎత్తు. 15 ఏళ్ల క్రితం, 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలో దాడులు జరిపిన అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు బిన్‌ లాడెన్‌కే పాక్‌ ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత కనీసం మూడుచోట్ల పాకిస్థాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు జరిపి భయోత్పాతం సృష్టించారు. యూపీఏ హయాములోనూ పాక్‌ పలు ఉగ్రవాద దాడులకు కారణమైంది. ముంబయిలోని తాజ్‌ హోటల్‌పై దాడులు జరిపిన కసబ్‌ బృందం ఎక్కడి నుంచి వచ్చిందో యావత్‌ ప్రపంచానికి తెలుసు. ముంబయిలోనే కాదు, వారణాసి, జైపూర్‌, అహ్మదాబాద్‌, దిల్లీ, హైదరాబాద్‌, అసోం వంటి అనేక ప్రాంతాల్లో పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు దాడులు జరిపారు. తాజాగా ఉరీలో సైనిక స్థావరంపై దాడి జరిపి 18 మంది వీర సైనికుల సజీవ దహనానికి పాక్‌ కారణమైంది. ఈ దుర్మార్గం పాక్‌ ఉగ్రవాదానికి పరాకాష్ఠ. ఇటీవల అరెస్టయిన పాకిస్థాన్‌ ఉగ్రవాది బహదూర్‌ అలీ, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఆ దేశ సైనికులు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాల గురించి, కంట్రోల్‌ రూం గురించి జాతీయ పరిశోధన సంస్థకు అనేక విషయాలు వెల్లడించాడు. హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వానీ ఎదురుకాల్పుల్లో మరణించిన తరవాత కశ్మీర్‌ లోయలో హింసాకాండను ప్రేరేపించేందుకు లష్కరే తొయిబా తరఫున తాను, తన సహచరులు ప్రవేశించినట్లు అతడు వెల్లడించాడు. వారు నిరసనకారుల వెనుక ఉండి గ్రేనేడ్లు విసిరినట్లు దర్యాప్తులో తేలింది.

హితవు పెడచెవిన...

భారతదేశం పొరుగుదేశాలతో నిత్యం సన్నిహిత సంబంధాలను ఆశించిందే కానీ వాటితో సంఘర్షణాత్మక వైఖరిని అవలంబించలేదనడానికి చరిత్రలో ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తాయి. బ్రిటన్‌, పశ్చిమాసియా దేశాలు, పోర్చుగల్‌ వంటివి సైతం భారత్‌పై దాడిచేశాయి. భారత్‌ ఏ దేశంపైనా దాడి జరపలేదు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాకిస్థాన్‌కు బస్‌యాత్ర ద్వారా కవులు, రచయితలు, కళాకారులతో వెళ్లి స్నేహ హస్తం సాచారు. ఆగ్రాలో ఒడంబడిక కుదుర్చుకున్నారు. వ్యాపార వ్యవహారాల్లో పాకిస్థాన్‌కు భారత్‌ పెద్దపీట వేసింది. పాకిస్థాన్‌ మాత్రం కార్గిల్‌లో చొరబడి కయ్యానికి కాలు దువ్వింది. అప్పుడూ భారత్‌ సంయమనంతో తిప్పికొట్టింది కానీ, తన శక్తిని ప్రదర్శించి పాక్‌పై ఆక్రమణకు పాల్పడలేదు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నరేంద్ర మోదీ సైతం వాజ్‌పేయీ మార్గంలో నడిచారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి పాక్‌ ప్రధానిని ఆహ్వానించారు. చర్చలు, సంప్రతింపుల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధించే మార్గాన్ని ఆయన అనుసరించారు. పాక్‌ ప్రధాని పుట్టిన రోజున అఫ్గానిస్థాన్‌ నుంచి లాహోర్‌ వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. నవాజ్‌ షరీఫ్‌ మాతృమూర్తి ఆశీర్వాదాన్నీ తీసుకున్నారు.

పాకిస్థాన్‌ ఏమి జవాబిచ్చింది? నాడు కార్గిల్‌లో చొరబడటం ద్వారా భారత్‌కు వెన్నుపోటు పొడిస్తే, ఇప్పుడు పఠాన్‌ కోట్‌, ఉరీలో ఉగ్రవాదులను పంపి కల్లోలం సృష్టించింది. ఇందుకు కారణం ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం ప్రపంచ దేశాలతో సంబంధ బాంధవ్యాలను పెంచుకోవడం, అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్ఠ పెరగడం, అభివృద్ధిపథంలో భారత్‌ దూసుకువెళ్లడాన్ని చూసి పాకిస్థాన్‌ సహించలేకపోతోంది. ఇరుదేశాలు తమను పట్టిపీడిస్తున్న పేదరికం, ఆర్థిక అసమానతలపై కలిసికట్టుగా పోరాడాలని, ఉగ్రవాదానికి తమ దేశాన్ని స్థావరం చేసుకోవద్దని భారత్‌ పలుమార్లు పాకిస్థాన్‌కు పిలుపునిచ్చింది. దీనివల్ల దక్షిణాసియాలోనే కాకుండా మొత్తం ప్రపంచంలో శాంతి దెబ్బతింటుందని బోధించింది. చర్చల ద్వారా శాంతిని సాధించాలని కోరింది. పాకిస్థాన్‌ మాత్రం ఉగ్రవాదులను పెంచి పోషించి, భారత్‌పైనే కాదు, ప్రపంచంలోని పలు దేశాలపైనా ఉసిగొల్పుతోంది. భారత్‌ స్నేహహస్తం సాచినప్పుడల్లా ఉగ్రవాద దాడులు నిర్వహించి భారత ప్రజల, ప్రభుత్వ సహసాన్ని పరీక్షిస్తోంది.

భారతదేశం సహనానికి, శాంతికి పెట్టింది పేరు. మొత్తం అంతరిక్షం, భూమి, వాయువు, నీరు, పశుపక్ష్యాదులు, ప్రకృతి వనరులు, విశ్వమంతా శాంతి నెలకొనాలని యజుర్వేదంలోని శాంతి మంత్రం తెలుపుతోంది. తైత్తిరీయ, కేన, బృహదారణ్యక, మాండుక్య తదితర ఉపనిషత్తులన్నీ శాంతినే బోధిస్తాయి. ప్రపంచమంతా ఒకే కుటుంబం (వసుధైక కుటుంబం) అన్న భావన భారత దేశం నుంచే వచ్చింది. యుద్ధం ద్వారా జరిగే వినాశం గురించి మన పూర్వీకులు ఎప్పుడో వూహించారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల వల్ల జరిగిన విధ్వంసం గురించి మనకు బాగా తెలుసు. స్త్రీకి ప్రసవం ఎంత అవసరమో, జాతికి యుద్ధం అంత అవసరంఅని ముస్సోలినీ వంటి ఫాసిస్టు అన్నాడు. యుద్ధ పిపాస లేకుండా కూటములు ఏర్పాటు చేయడం అవివేకమైన పనిఅని హిట్లర్‌ వంటి నియంత అన్నాడు. ఫాసిస్టులు, నియంతలు మాత్రమే యుద్దోన్మాదులు. ప్రజాస్వామ్య దేశాలు యుద్ధ పరిభాషలో మాట్లాడకూడదు. బుద్దుడు, అశోకుడు, మహావీరుడు మొదలుకొని గాంధీజీ వరకు మనకు అహింసను, శాంతిని మాత్రమే బోధించారు. మహాత్మాగాంధీ వంటి రక్తమాంసాలున్న ఒక మనిషి ఈ నేలపై నడయాడారన్న విషయం నమ్మశక్యం కాదుఅని ఐన్‌స్టీన్‌ వంటి గొప్ప శాస్త్రవేత్త వ్యాఖ్యానించారు. అలాంటి మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో మా ప్రభుత్వం నడుస్తోంది. ఆయన పేరుపై పలు ప్రజాసంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తోంది.

ఇలాంటి భారతదేశం పాక్‌ దుర్మార్గాలను ఇంకెంతకాలం సహించాలి? ఉరీలో ఉగ్రవాద దాడులతో ఈ దేశ ప్రజలు ఎంతో ఆవేశానికి గురయ్యారు. ఈ దాడులపై భారత్‌ తన నిరసన తెలిపింది. ఇలాంటి చర్యల్ని మానుకోవాలని ఆ దేశ రాయబారిని పిలిచి మరీ చెప్పింది. ఇరు దేశాలు తమను పట్టిపీడుస్తున్న సామాజిక, ఆర్థిక రుగ్మతలపైనే పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం పిలుపు ఇచ్చారు. ఇకనుంచి ఇలాంటి సంఘటనలను సహించబోమని, దేశ భద్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. ఉరీ ఘటనను పలుదేశాలు ఖండించాయి. పాకిస్థాన్‌ ఉగ్రవాద దేశంగా మారిందని, హక్కానీ నెట్‌ వర్క్‌తో పాటు పలు ఉగ్రవాద సంస్థలకు పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ మద్దతు ఇస్తున్నాయని అమెరికా, బ్రిటన్‌తో పాటు అనేక దేశాలు తీర్మానించాయి. అయినప్పటికీ, పాకిస్థాన్‌ తప్పు ఒప్పుకోలేదు. ఉరీ దాడులను సమర్థించుకుంది. స్వయంగా ఉగ్రవాదులను పంపి కల్లోలం సృష్టించిన ఆ దేశం, కశ్మీర్‌లోని తిరుగుబాటు దారులే ఈ దాడులు చేశారని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో కూడా ఈమేరకు పాకిస్థాన్‌ ప్రధాని తప్పుడు ప్రచారం చేశారు. నిజానికి కశ్మీరీలు శాంతి ప్రేమికులు. మెజారిటీ ప్రజలు శాంతిని, అభివృద్ధినీ కోరుకుంటున్నారు. భారత్‌లో మరిన్ని దాడులు జరిపేందుకు పాక్‌ సన్నాహక దళాలనూ సిద్ధం చేసింది. ఈ సమాచారం అందిన తరవాత కూడా భార తదేశం వూరుకుంటుందా? మనదేశ భద్రతను కాపాడాల్సిన బాధ్యత మన సైన్యానిది. వారు అప్రమత్తంగా ఉండటంతో నియంత్రణ రేఖ వెలుపల పాకిస్థాన్‌ పన్నిన కుట్రల గురించి తెలిసింది. మనదేశాన్ని కాపాడే బాధ్యతలో భాగంగానే సైనికులు ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న లాంచింగ్‌పాడ్‌ లను ధ్వంసం చేసి మరీ వచ్చారు. అక్కడ పాక్‌ సైన్యం పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్న ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ, సరిహద్దుల్లో కల్లోలం సృష్టించడాన్ని పాక్‌ మానలేదు. ఇటీవలి కాలంలో 17 సార్లు పాక్‌ ఉగ్రవాదులు సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చారు. ఇలాంటి దాడులను ఎలా తిప్పికొట్టాలో భారత ప్రభుత్వానికీ, మన సైన్యానికీ బాగా తెలుసు. పాక్‌ ఉగ్రవాద కుట్రల్ని భగ్నం చేసేందుకు అప్రమత్తంగా ఉన్న భారత సైన్యానికి ఈ దేశ ప్రజలు ఎంతో కృతజ్ఞులు. వారు కనుక జాగరూకతతో లేకపోయినట్లయితే పాక్‌ ఉగ్రవాదులు ఈ దేశంలో మరెన్ని దుర్మార్గాలకు పాల్పడి ఉండేవారో!


యుద్ధకాంక్ష లేదు

భారత్‌ శాంతిని ప్రేమించే దేశం. రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు కొట్టలేం. పాకిస్థాన్‌ హింసాకాండను ప్రేమిస్తోంది. భారత్‌లో అనేక మతాలు, జాతులు, కులాలు శాంతియుతంగా సహజీవనం చేయడం, వేగవంతంగా అభివృద్ధి జరగడాన్ని సహించలేక ద్వేషంతో రగిలిపోతోంది. తమ దేశంలోనే బలూచిస్థాన్‌, సింధ్‌ ప్రాంతాల్లో దౌర్జన్యాలను సహించలేక తిరుగుబాటు చేస్తున్న ప్రజలను అణిచివేస్తోంది. రక్తపాతం సృష్టిస్తోంది. కేవలం తమ రాజకీయ మనుగడ కోసం కశ్మీర్‌లో చిచ్చురేపుతోంది. కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ ప్రజల్లో విద్వేషాన్నిపెంచి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. కానీ, మెజారిటీ పాకిస్థాన్‌ ప్రజలకు సైతం పాక్‌ ప్రభుత్వం, ఐఎస్‌ఐ, సైన్యం చేస్తున్న దుర్మార్గాలు ఆమోదయోగ్యంగా లేవు. అక్కడ మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, స్వేచ్చ, స్వాతంత్య్రాలకు విలువ ఎక్కడిది? భారత ప్రభుత్వానికి యుద్ధ కాంక్ష లేదు. ఒక దేశాన్ని కబళించాలన్న ఆలోచన లేదు. రామాయణంలో కూడా సీతను రావణుడి చెర నుంచి విముక్తి చేసిన తరవాత లంకను రాముడు ఆక్రమించుకోలేదు. సరికదా రావణుడి సోదరుడు విభీషణుడికి రాజ్యం కట్టబెట్టాడు. అదే విధంగా పాకిస్థాన్‌ మారణకాండకు గురైన బంగ్లాదేశ్‌ను విముక్తి చేసిన తరవాత ఆ దేశం స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు అవకాశం ఇచ్చాం. ఈ దేశం ఏ భూభాగాన్నీ ఆక్రమించేందుకు యుద్ధాలు చేయలేదు. ప్రపంచంలో ఏ దేశంపైనా ఈ దేశం దాడులు చేయలేదు’. అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవాస భారతీయ దివస్‌సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు. భారతదేశం సాఫ్ట్‌వేర్‌ ఎగుమతి చేస్తుంటే పాక్‌ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోందనీ అన్నారు.

భారత్‌ శాంతికాముక దేశమని ప్రపంచదేశాలన్నిటికీ తెలుసు. శాంతి గురించి మాట్లాడటం బలహీనత అనుకోరాదు. అదే సమయంలో మనదేశ భద్రతకు, సమగ్రతకు ముప్పు ఏర్పడితే చేతులు ముడుచుకునే రోజులు పోయాయి. అంతర్జాతీయ చిత్రపటంలో అభివృద్ధి చెందిన దేశంగా స్థానం సంపాదించేలా, అన్నిరంగాల్లో అగ్రగామి దేశంగా గుర్తింపు పొందేలా భారత్‌ను రూపొందించడమే నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. భారత్‌ శాంతిసామరస్యాల బాటలో సాగుతోంది. దీన్ని అలుసుగా తీసుకొని భారతదేశంలో కల్లోలం సృష్టించేందుకు, మన సరిహద్దులు అతిక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే తిప్పిగొట్టేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి. ఈ విషయంలో భారతదేశ ప్రజలు పూర్తిగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అండగా ఉన్నారు. దేశాన్ని అన్నివిధాలా తలెత్తుకొని నిలబడేలా తీర్చిదిద్దేందుకు వారు సిద్ధంగా ఉన్నారు.

-ఎం. వెంకయ్య నాయుడు
(కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ పట్టణ పేదరిక నిర్మూలన, సమాచార ప్రసార శాఖల మంత్రి)
(ఈనాడు సౌజన్యం తో)  

No comments:

Post a Comment