29 December, 2014

దారుణం... దుర్మార్గం!!

ఆంధ్రభూమి ''వీక్ పాయింట్'' 
 
 
వన్‌వే రోడ్డులో ట్రాఫిక్ ఎప్పుడూ ఒకే దిశలో వెళ్లాలి గదా? అవతలివైపు నుంచి ఏ కుర్రకారువాడో ఎదురొస్తే ఎవరికైనా ఒళ్లుమండదూ?! 
 
మతాంతరీకరణా అంతే. మన పుణ్యభూమిలో మతం మార్చడమనేది వన్‌వే రోడ్డు. మార్పిడి ఎప్పుడూ హిందూ మతం నుంచే జరగాలి. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు’ అని లోకమాన్యుడు అన్నట్టు హిందువులను తమ మతంలోకి లాగేసుకోవటం పరాయి మతాల జన్మహక్కు. కంచె లేని తమ కమతం నుంచి తమ వారిని బయటి వాళ్లు బలవంతంగానో, బహుమానాలతోనో, ఎరలు విసిరో, మాయ చేసో, కుట్రపన్నో కోడిపిల్లల్లా ఎత్తుకుపోతుంటే గుడ్లప్పగించి చూస్తూ నోరు మూసుకుని పడి ఉండటమే హిందువుల విధి. ఇది మన భాగ్యవిధాతలు పెద్ద మనసుతో పెట్టిన గోల్డెన్ రూలు. 
 
అదీ ఈనాటిదా? బ్రిటిషువాళ్లు తట్టాబుట్టా సర్దుకుని, తమ మానసపుత్రులైన మనవాళ్ల చేతికి పవరు అప్పగించి చక్కా పోయింది మొదలుకుని నేటిదాకా తరతరాలుగా కడు నిష్ఠతో పాటిస్తూ వచ్చిన కట్టుబాటు ఇది. అంతటి ఘన నియమాన్ని కాస్తా తుంగలో తొక్కి, ‘నీవు నేర్పిన విద్య’ను నీకే నేర్పిస్తామని అడ్డం తిరిగి, రాకూడని రూటులో హిందువులు ఎదురొస్తే... అంతకంటే ఓఘాయిత్యం ఏమన్నా ఉందా? కళ్లలో వొత్తులు వేసుకుని ఇన్ని తరాలుగా సోకాల్డ్ సెక్యులరిజాన్ని కూలీ లేకుండా కావలికాస్తూ, పరమతాల పరవళ్లను పరమానందంగా వెనకేసుకువస్తున్న వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, రాజకీయ, అరాజకీయ వర్గాల సెక్యులర్ గుండెలు భగ్గున మండవా? 
 
కాంగ్రెసు మార్కు సెక్యులర్ స్వర్గం నుంచి మోదీ నరకంలోకి దేశం జారిపడి ఆర్నెల్లు తిరిగాయో లేదో హిందుత్వం జూలు విదిలించింది. పోయి పోయి, ఔరంగజేబు లాంటి మహాత్ముల ఆటపట్టయిన ఆగ్రాలో ఏకంగా 350 మంది మహమ్మదీయులను హిందూ మతంలోకి తిరిగి తెచ్చారు. ఈ గుండెలు తీసిన గుండాగిరీకి లాలూ, ములాయం, సోనియా మాతల్లాంటి సెక్యులర్ సంరక్షకులు భీకరంగా గర్జించి, గర్హించి, సత్తా చూపిస్తూండగానే రాజస్తాన్ నుంచి కేరళదాకా అనేక రాష్ట్రాల్లో ‘రివర్సు మతమార్పిళ్లు’ ముమ్మరమయ్యాయి. ‘హిందూ రాజ్యం అన్యమతాల భోజ్యం’ అన్న చిరకాల విశ్వాసాన్ని వమ్ముకావించి, మీరు ఇలా ఎలా చేస్తారని పార్లమెంటు లోపలా, వెలుపలా సెక్యులర్ కులదీపకులు బాగానే నిలదీశారు. అయినా హిందూ పరివారానికి జంకూ గొంకూ లేదు. 
 
విదేశీ మతాలు దిగుమతి కావడానికి ముందు ఈ దేశంలో ఉన్నవారంతా హిందువులేనట. మెడమీద కత్తిపెట్టో, ప్రలోభాలు చూపించో బలవంతంగా మతం మార్పించిన హిందువుల సంతతిని ఇప్పుడు మళ్లీ హిందూ ధర్మంలోకి వెనక్కి తీసుకోవటం మతమార్పిడి కాదట. వారి ఇంటికి వారు తిరిగి రావటమే అవుతుందట. మతం మార్చేందుకు ఇతర మతాల వారికి ఎంత హక్కు ఉందో, మారిన వారిని మార్చేందుకు తమకూ అంతే హక్కు ఉందట. ఇదెక్కడి వితండవాదం? అన్ని మతాలనూ సమానంగా చూడాలని వ్రతం పట్టిన సెక్యులర్ దేశంలో మైనారిటీలు గుంజుకున్న ప్రత్యేక హక్కులు తమకూ కావాలని మెజారిటీ మతం వారు వాదులాడటం ఎంత అన్యాయం?! 
 
లక్షల కోట్ల రూపాయల విదేశీ నిధులు విచ్చలవిడిగా విరజిమ్మి, రకరకాల ప్రలోభాలతో, మారీచుడిని మించిన మాయోపాయాలతో, పకడ్బందీ వ్యూహాలతో, పాపిష్టి పన్నాగాలతో మహానగరాల నుంచి మారుమూల పల్లెలదాకా... సంపన్నకులీనుల నుంచి బికారి ఆదివాసుల వరకూ అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల వారినీ భారీ ఎత్తున, తెరీపి లేకుండా తమ మతంలోకి లాగేస్తూ ‘ఆత్మల పంటలను’ విదేశవాళీ పరిశుద్దాత్ములు ఇప్పటికీ విరగ పండిస్తూనే ఉండవచ్చు. చదువు కోసం తమ బారిన పడ్డ బిడ్డలకు హద్దూ పద్దూ లేకుండా బుద్ధిశుద్ధి చేసి, హిందూ మతమన్నా, హైందవ దేవుళ్లన్నా, హిందూ సంప్రదాయాలన్నా అసహ్యం పుట్టించి, మాట వినని వారికి మార్కులివ్వమని బెదిరించి, మతం మారమంటూ పిశాచాల్లా పీడిస్తూనే ఉండవచ్చు. చట్ట వ్యతిరేకంగా ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి, చెవులు పగిలే సంగీతాలతో చుట్టు పక్కలవారికి పిచ్చెత్తిస్తూ... లంచాల, విందుల, కానుకల, ఉపకారాల ఎరలతో, దుర్మార్గపు బెదిరింపులతో, వేధింపులతో నయానో భయానో ఏకధారగా మతమార్పిళ్లను సాగించే ప్రార్థనా మందిరాల సువార్తలూ జగమెరిగిన సత్యాలే. సెక్యులర్ రాజ్యాంగం రక్షణలు పొందుతూ, దేశంలో నూటికి 80 మందికి చెందిన పెద్ద మతాన్ని కుళ్ల పొడిచి, సెక్యులర్ ఇండియాను మరో పాకిస్తాన్‌గా పథకం ప్రకారం మార్చుకుపోతున్న జిహాదీల మతమార్పిళ్ల ఆగడాలూ అందరికీ తెలిసినవే. 
 
అలాగని పరాయ మతాలకుగల పేటెంటు హక్కులకు హిందువులు పోటీ వస్తే సహిస్తామా? ఊళ్లకు, ఊళ్లు, జిల్లాలకు జిల్లాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలు హిందూ ధర్మం నుంచి వేరుపడి విదేశీ మతాల ప్రాబల్యంలోకి వెళుతుంటే ఉదారంగా ఉపేక్షించిన మనం మతాంతరీకరణ ఆయుధాన్ని హిందువులూ చేపడితే చూస్తూ ఊరుకుంటామా? మత మార్పిడి అనేది మైనారిటీలకు మాత్రమే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని దబాయంచే వాళ్లం అదే హక్కును మెజారిటీ మతస్థులూ ఉపయోగించుకుంటామంటే ఎలా అనుమతిస్తాం? 
 
రేషన్ కార్డులిస్తామని మభ్యపెట్టి ఆగ్రా ముస్లింలను హిందూ మతంలోకి బలవంతంగా తిరిగి తెచ్చారని పార్లమెంటులో మనవాళ్లు బాగానే నిగ్గదీసారు. ‘ఔనా! మాకు తెలియదే’ అని మాయదారి మోదీ సర్కారు అడ్డం తిరిగింది. బలవంతంగా మతం మార్పించి ఉంటే చట్ట ప్రకారం కేసు పెట్టుకోండి అని ఉచిత సలహా పారేసింది. ఆగ్రాలో ఉన్నది మన వాళ్ల రాష్ట్ర ప్రభుత్వమేనాయే! కేసు పెట్టాల్సింది, కదిలించాల్సింది మన వాళ్లే కాబట్టి మోదీ జమానాను తప్పు పట్టలేము. మతమార్పిడులను మొత్తంగా చర్చిద్దాం; మీరు ఊఁ అంటే చాలు అక్రమ మతాంతరీకరణలను నిషేధించే శాసనం అర్జెంటుగా పట్టుకొస్తాం- అన్న మోదీ ప్రభుత్వం ఆఫర్‌కు ‘సరే’ అనలేము. ఎందుకంటే మతాంతరీకరణల కంపను కెలికితే మన కంపు బయటపడుతుంది. మన ముద్దుల మైనారిటీలకే ఇబ్బంది కలుగుతుంది. మతమార్పిడుల మీద జాతీయ చర్చకు ఇన్నాళ్లూ ఎన్ని విధాలా ప్రయత్నించినా మనం పడనివ్వలేదు కనుక ఆర్‌ఎస్‌ఎస్ దుర్మార్గులు ఇప్పుడు ఈ రూటులో వచ్చారు. తెలిసి తెలిసి వారి ఉచ్చులో ఎలా పడతాం? అలాగని గమ్మున ఊరకుంటే రివర్స్ మతమార్పిడుల ధాటిని ఎలా అడ్డుకుంటాం? ముందు నుయ్య - వెనుక గొయ్య. సెక్యులర్ దేవుడా, ఏది దారి?
 
Courtesy : Andhra Bhoomi

No comments:

Post a Comment