ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ఎన్‌జివో. లండన్‌లో 1961లో ఒక ఆంగ్ల కార్మిక
న్యాయవాది పీటర్ బెనిసన్ దీన్ని ప్రారంభించాడు. పోర్చుగల్‌లో నాటి నేతల
మానవహక్కుల ఉల్లంఘనను ఉటంకిస్తూ ప్రతిరోజు ఏదో ఓ చోట ప్రజలపై పాలకులు
జరుపుతున్న దౌర్జన్యాలను నిరసిస్తూ ఆయన ఆంగ్లపత్రికలలో వ్యాసాలు రాసేవాడు.
అదే కొందర్ని మేల్కొల్పింది. బెనిసన్‌కు కొందరు సహచరులు అనుచరులు లభించారు.
కొయింబ్రాకు చెందిన ఇద్దరు విద్యార్థులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో
ఏకీభవించని పోర్చుగల్ ప్రభుత్వం వారిని నిర్బంధించింది. నాటి ప్రభు త్వం
కమ్యూనిస్టులను వ్యతిరేకించేది. ఆ దేశ రాజ్యాంగంలోని 18వ, 19వ అధికరణలు
నిర్దేశించే విశ్వజనీన మానవహక్కుల ప్రకటనకు వ్యతిరేకంగా పాలకులు
వ్యవహరించిన తీరు పత్రికాస్వేచ్ఛకు భంగంకలిగిన తీరు, వీటన్నింటిపై ‘అప్పీల్
ఫర్ అమ్నెస్టీ 1961’తో మొదలైంది. క్రమంగా సెప్టెంబర్ 1962లో ఆమ్నెస్టీ
ఇంటర్నేషనల్ ఏర్పడింది.
అలా మొదలైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గత 55 ఏళ్లలో తన స్వరూప స్వభావాలను
అనేకసార్లు మార్చుకుంటూ వచ్చింది. ఆమ్నెస్టీ స్ర్తి విభాగం పూర్వ అధికారిణి
గీతా సెహగల్ ఆమ్నెస్టీని తూర్పారబట్టింది. కాశ్మీర్ తీవ్రవాదులను
ఆమ్నెస్టీ వెనకేసుకు రావడాన్ని ప్రశ్నించింది. దీంతో ఆమె 2010లో
బహిష్కృతురాలైంది. ఆమ్నెస్టీ సైద్ధాంతిక దివాలాకోరుతనాన్ని గీతా సెహగల్
ప్రశ్నించడమే ఇందుకు కార ణం. ది గార్డియన్ పత్రిక కథనం ప్రకారం ఆమ్నెస్టీకి
తాలిబన్ నాయకులతో సంబంధాలున్నాయి. మోజామ్ బేగ్ అనే తాలిబన్ నాయకుడ్ని
పాకిస్తాన్‌లో అరెస్టు చేసారు. ‘కేజ్ ప్రిజనర్స్’ అనే సంస్థకు ఈయన నాయకుడు.
అశీమ్ ఖురేషి అనే మరో తాలిబన్ నాయకుడు కూడా జిహాదీ ఊరేగింపులను
సమర్ధిస్తాడు. వీళ్లందర్నీ అమ్నెస్టీ తన ప్రతినిధి బృందంలో వేసుకుంది.
వీరంతా మానవహక్కులపై బ్రిటన్ ప్రభుత్వాన్ని నిలదీస్తారు.
తాజాగా బెంగుళూరులో ఆగస్టు 13వ తేదీ యునైటెడ్ థియాలాజికల్ కళాశాలలో
ఆమ్నెస్టీ నిర్వహించిన ఓ సదస్సులో ఒక కాశ్మీరీ పండిట్ భారత సైన్యాన్ని
ప్రస్తుతిస్తూ మాట్లాడినందుకు నిరసనగా కొందరుకాశ్మీరీలు ‘కాశ్మీర్‌కు
స్వాతంత్య్రం కావాలని‘ నినాదాలు చేసారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
దీన్ని భారత వ్యతిరేక సంఘటనగా పేర్కొంది. దీనిపై ఆమ్నెస్టీపై ఐపిసి
చట్టంలోని 142, 143, 147, 124ఎ, 153ఎ నిబంధన కింద పోలీసులు కేసు నమోదు
చేసారు. తమ సభ్యులెవరు భారత వ్యతిరేక నినాదాలు ఇవ్వలేదని ఆమ్నెస్టీ
నమ్మబలికింది. ఈ సంఘటన తాలుకు సిడిని కూడా ఎబివిపి పోలీసులకందచేసింది. తాము
జమ్ము కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఉద్యమిస్తున్నామని ఆమ్నెస్టీ
బీరాలు పలుకుతోంది. నేపథ్యం తెలిసిందే. బుర్హన్ వనీ అనే పేరుగల జిహాదీ
తీవ్రవాదిని భారత సైన్యం మట్టుపెట్టినందుకు నిరసనగా కాశ్మీర్‌లో గత
రెండ్నెల్లుగా అల్లర్లు జరిగి సుమారు అరవైమంది కాశ్మీరీ యువకులు హతమయ్యారు.
కాశ్మీర్ లోయలో ముస్లిం యువకులు సైన్యం కాల్పుల్లో చనిపోవడం ఖండించదగిందే.
అయితే అల్లర్లు జరిగిన సందర్భం మాత్రం సందేహించదగింది.
ఓ విదేశీ ముష్కరుడు చనిపోతే అతని శవయాత్ర ఘనంగా చేయడం, సైన్యంపై
విరుచుకుపడడం రాళ్లు రువ్వడం కాశ్మీర్‌పై భారత సార్వభౌమాధికారానికే సవాలు
విసిరే విష యం. కానీ ఈ విషయాన్ని మానవహక్కుల ఉల్లంఘనతో ముడిపెట్టి సదస్సులు
జరపడం ఆమ్నెస్టీకే చెల్లింది. ఇదే అమ్నెస్టీ 1989-90 ప్రాంతంలో ఐదు
లక్షలమంది కాశ్మీరీ పండితులు కాశ్మీరు నుంచి గెంటివేయబడితే ఎందుకు
ప్రశ్నించలేదు? కేవలం 60 కుటుంబాలు మాత్రం మిగిలిన కాశ్మీరీ పండితుల
మానవహక్కుల గురించి ఎందుకు ఉద్యమించదు? గత ఇరవై ఏళ్లుగా సీమాంతర
తీవ్రవాదంతో కాశ్మీర్‌లో, భారత్‌లో పేలుళ్ల పేర విధ్వంసం సృష్టిస్తున్న
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను, ముఠాలను ఎందుకు రచ్చకీడ్చలేదు. విశ్వయవనికపై
పాకిస్తాన్ పాలకుల పైశాచికత్వాన్ని ఎందుకు ఎండగట్టలేదు? ఈ జిహాదీ శక్తులు
బ్రిటన్‌లో భూసొరంగ మార్గంలో నడిచే రైలులో పేలుళ్లు జరిపినా ఆమ్నెస్టీ
నిరసించిన దాఖలాలు లేవు.
ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదులు సృష్టిస్తున్న
నరమేధం గురించి భారత్‌లో ముస్లిం వౌల్వీలు స్పందించినంతగా కూడా ఈ పౌరహక్కుల
సంస్థ మాట్లాడలేదు. శ్రీమతి గీతా సెహగల్ ప్రకారం పాలస్తీనా
విముక్తపోరాటంలో పాలస్తీనా విమోచన సంస్థకంటె, అక్కడి సెక్యులర్ మానవహక్కుల
నేతల స్వరం కంటె తీవ్రవాద గ్రూపులైన హమాస్ వంటి వారి మద్దతుదారులకే
ఆమ్నెస్టీ మద్దతునిచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా డెభ్భై లక్షలమంది సభ్యులున్న ఆమ్నెస్టీ నేడొక
విశ్వవ్యాప్త సంస్థ. పరిశోధన, ప్రచారం ఈ సంస్థకు రెండు ఆయుధాలు. ఇందుకోసం
ఒక బృహత్ గ్రంథాల యం ఉంది. అన్ని దేశాలలో ఈ సంస్థతో లబ్ధిపొందే స్థానిక
గ్రూపులెన్నో ఉన్నాయి. ఆమ్నెస్టీ ఉప్పుతినే వారంతా విషయ శోధనలో కావలసినంత
ఉప్పందించే పనిలో ఎప్పుడూ ఉంటారు. దక్షిణాఫ్రికా విముక్తపోరాటంలో
అవిశ్రాంతంగా శ్రమించిన యోధుడు నెల్సన్ మండేలాను వీరు ‘నిర్బంధకుడి’గా
గుర్తించారు. భారత్‌లో యాకుబ్ మెమెన్, అఫ్జల్‌గురు, కసబ్‌లను ఉరి తీసినపుడు
ఆమ్నెస్టీ ఆక్రోశించింది. అన్యాయమంది. నీచమంది. భారత్ అవసరాలను, అవకాశాలను
కూడా ఆమ్నెస్టీ నిర్ణయిస్తుందా? ఇది ఓ ప్రజాస్వామ్య ప్రభుత్వ అధికారాన్ని
ధిక్కరించడం కాదా? 2015లో 320 మందికి భారత్‌లో ఉరిశిక్ష విధించారని కేవలం 7
ఉరి శిక్షలను రద్దు చేసారని నివేదిక తయారుచేసింది. ప్రపంచవ్యాప్తం గా 1634
మందికి 25 దేశాలలో ఉరిశిక్ష విధిస్తే అత్యధికంగా 90 శాతం చైనాలో, తరువాత
ఇరాన్, పాకిస్తాన్, సౌదీ, అమెరికాలో ఉన్నా యి. భారత్‌లో సగటున ఏడాదికి 3
ఉరి శిక్షలు అమలవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మతప్రసక్తితో నడిచే రాజ్యాలలో
జరుగుతున్న శిక్షల గురించి ఆమ్నెస్టీ ఎందుకు ప్రశ్నించదు? 1969లో
ఆమ్నెస్టీ సభ్యత్వ రుసుము రు.15,000నుంచి 1979లో రు.2,00,000 కు పెంచింది.
నిర్బంధకులకు సహాయ నిధి అం దించడం కూడా మొదలుపెట్టింది. 1972లో ఈ సంస్థ
అమెరికాలో మానవ హక్కులకు సంబంధించిన సలహా సంప్రదింపుల సంఘం హోదా కూడా
పొందింది. 1977లో ఈ సం స్థకు యుఎన్‌ఐనుంచి నోబుల్ శాంతి పురస్కారం కూడా
లభించింది.
1986లో రజతోత్సవ సందర్భంలో తపాలా బిళ్ల విడుదలైంది. 1980లో
రష్యా ఈ సంస్థపై గూఢచర్య నేరం మోపింది. మొరాకో ప్రభుత్వం ఈ సంస్థ
చట్టద్రోహులకు రక్షణనిస్తోందని ఆరోపించింది. అర్జెంటీనా ప్రభుత్వం
ఆమ్నెస్టీ 1983 వార్షిక నివేదికను నిషేధించింది. 1995లో నైజీరియాలో షెల్
ఆయిల్ కంపెనీ చమురు తవ్వకాలపై ఆమ్నెస్టీ ఉద్యమించింది. కాని ప్రజలు,
ప్రభుత్వం, మీడియా దాన్ని వ్యతిరేకించాయి. ప్రజల జీవనం మెరుగుపడేందుకు,
అభివృద్ధికి ఆమ్నెస్టీ అడ్డుపడుతోందన్న అభిప్రాయం కలిగింది. ఆమ్నెస్టీ
వెంటనే షెల్ ప్రయత్నాన్ని సమర్ధించింది.
2000 సంవత్సరం తరువాత అమ్నెస్టీ
ప్రపంచీకరణకు వ్యతిరేకంగా గళమెత్తింది. సెప్టెంబర్ 11, 2001 నాడు అమెరికాలో
జరిగిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం గురించి ఆమ్నెస్టీ ఒక్క మాట
మాట్లాడలేదు. అంతకుముందు నాలుగు దశాబ్దాలుగా వారు నిర్మించినట్టు
చెప్పుకున్న సౌహార్ధ్రం, కుప్పకూలిన వ్యాపార సౌధాల శకలాల్లో కలిసిపోయిం ది.
నాటి బుష్ ప్రభుత్వం ఆమ్నెస్టీని తీవ్రంగా విమర్శించింది. 2011లో
ఆమ్నెస్టీ బుష్‌ను ని ర్బంధించమని విచారణ జరిపించమని యుఎన్‌ఓను కోరింది.
2003నుంచి 2008 వరకు జరిగిన ఇరాక్ యుద్ధం నేపథ్యంలో ఆమ్నెస్టీ చేసిన
విజ్ఞప్తిని యుఎన్‌వో ఖాతరు చేయలేదు. 2009లో గాజాలో ఇజ్రాయిల్ పాలస్తీనాపై
విరుచుకుపడిన ఘటనలో 1400 మంది పాలస్తీనా పౌరులు, 13మంది ఇజ్రాయిలీలు
చనిపోయారు. ఆమ్నెస్టీ ఇజ్రాయిల్‌ను తప్పుపట్టింది. యుఎన్‌ఓను చర్య
తీసుకోమని కోరింది. తమ దేశాన్ని రక్షించుకునే వ్యూహంలో ఇజ్రాయిల్ దాడి
చేసింది. చుట్టుముట్టి వున్న 23 అరబ్బు రాజ్యాలనుంచి తమ దేశాన్ని
రక్షించుకునేందుకు ఇజ్రాయిల్ చేసిన దాడిని యుఎన్‌ఓ కూడా అర్ధం చేసుకుంది.
మహిళలు, పిల్లల హక్కులు, వేధింపు, హింస, ఉరిశిక్ష రద్దు, శరణార్ధులకు
హక్కులు, నిర్బంధించబడిన ప్రిజనర్స్ హక్కులు, మానవగౌరవం వంటి లక్ష్యాలతో
పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఐసిస్ మూకలు మహిళలను చంపడం, యుద్ధ ఖైదీలుగా
పట్టుకుని వారితో లైంగిక వాంఛలను తీర్చుకోవడాన్ని ఖండించదు. కాశ్మీర్‌లో
మహిళా హక్కులపై ఏనాడు పోరాటం చేయదు. చాలా లైంగిక నేరాలతో రెచ్చిపోయిన
వాటికన్ మతాధికారుల జులుంను తప్పుపట్టదు. భారత్‌కు వచ్చి నంగనాచి కబుర్లతో,
మీడియాను హోరెత్తిస్తుంది. భారత్ 2015-16 నివేదికలో ఆమ్నెస్టీ, భారత్‌లో
మత ఉద్రిక్తతలు పెరిగిపోయాయని, లింగ, కుల వివక్ష పెరిగిపోయిందని మేధావులు,
కళాకారులు, అవార్డులు వాపసు చేసారని, సైనికుల అరాచకం పెరిగిందని అంటూనే
నాగాలాండ్‌లో చారిత్రక ఒప్పందం కుదిరిందని రాసింది. తీవ్రవాద వ్యతిరేక
చట్టాలు ప్రభుత్వాలు ఉపయోగిస్తున్నాయని, అవి అంతర్జాతీయ మానవహక్కుల
ప్రమాణాలకు సరిపోవని కొంగజపం చేసింది. 16-18 వయసుగల పిల్లలు చేసిన నేరాలను
కూడా పరిగణనలోకి తీసుకుంటూ బిల్లు ఆమోదం పొందిందని, ఇది అంతర్జాతీయ న్యాయ
సూత్రాలకు విరుద్ధమని వాదించింది. చందనం దొంగలను ప్రభుత్వాలు హతమారు
స్తున్నాయని, ఎన్‌జివోలకు నిధులు వినియోగంలో అవకతవకలు జరగడంవల్ల నిధుల రాక
నిలిపివేసారని ఇలా అనేక విషయాలు ఆ నివేదికలో పొందుపరిచారు. అయితే నివేదిక
తయారీలో వాస్తవికత, దూరదృష్టి లేదు. ప్రతి విషయంలోను ప్రభుత్వాలను
నిందించడం తప్ప ప్రజా సమస్యలకు స్పందించిన సంద ర్భం కానరాదు. ఏతావాతా
తేలేదేమంటే ఆమ్నెస్టీ ఆట అంతా నిర్బంధం లేదా జైలు చు ట్టూ తిరుగుతుంది.
జైలులో అపరాధివున్నా నిరపరాధి ఉన్నా వారిది ఒకటే పాట. స్వేచ్ఛ పేరున నేరం,
చట్టం, నియమం, నీతి, రీతి, రివాజు, కట్టుబాట్లు, క్రమశిక్షణ ఇవన్నీ ఈ
సంస్థకు పట్టని విషయాలు. ఏకరూపత పేరున భారత్‌లో భిన్నత్వంలో ఏకత్వానికి
వక్రభాష్యం చెప్పేందుకే ఈ తరహా సంస్థలు ఉద్యమిస్తుంటాయి. అబద్ధాన్ని
పదిసార్లు చెప్పి నిజం చేయాలనుకునే ఈ సంస్థ పోకడలను ఎండగడుతుండాలి.
-తాడేపల్లి హనుమత్ ప్రసాద్
(ఆంధ్ర భూమి సౌజన్యం తో)
-తాడేపల్లి హనుమత్ ప్రసాద్
(ఆంధ్ర భూమి సౌజన్యం తో)
No comments:
Post a Comment